నాటి `ప్రాభ‌వం` కోల్పోతున్న బీఆర్ ఎస్‌.. రీజ‌నేంటి?

భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌).. ఈ పేరుకు పెద్ద ప్రాభ‌వమే ఉంది. ఒక్కొక్క‌పార్టీకి నాయ‌కుల పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు మాత్రం నాయ‌కుడే కాదు.. పార్టీ పేరు కూడా అత్యంత కీల‌కం. ప్ర‌జ‌ల మ‌ధ్య‌.. ప్ర‌జ‌ల చేత గుర్తింపు పొందిన పార్టీగా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది. ఉద్య‌మ సమ‌యంలో ప్ర‌జ‌లు ఏక‌మై.. పార్టీని త‌మ‌దిగా భావించారు. ఇంటింటా పార్టీ జెండా ఎగిరిన గ్రామాలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేత‌గా కేసీఆర్‌కు పెద్ద ఎత్తున అభిమానం కూడా ల‌భించింది.

అయితే… ఇది గ‌తం!. ప్ర‌స్తుతంలోకి వ‌స్తే.. పార్టీ ప్రాభ‌వం త‌గ్గుతోంది. ఒక‌ప్పుడు జెండాలు ఎగిరిన గ్రామాల్లో ఇప్పుడు పార్టీ ప్ర‌స్థానం ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. వ‌రుస విజ‌యాలు అందించిన బీఆర్ఎస్‌ను ప్ర‌జలు ప‌క్క‌న పెడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం జ‌రిగిన గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో.. పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా అడుగులు వేయ‌డం స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి ఈ ప‌రిస్థితిని మార్చుకుని అడుగులు వేయా ల్సిన అవ‌స‌రం బీఆర్ఎస్‌కు ఎంతో ఉంద‌న్న‌ది వాస్త‌వం.

కేసీఆర్ కోసం.. ఎంత మంది?

ఒక‌ప్పుడు కేసీఆర్ పేరు ప్ర‌తి నోటా వినిపించింది. ప్ర‌తి ఒక్క‌రూ `కేసీఆర్ స‌ర్‌` అని ఎంతో గౌర‌వంగా పిలు చుకునేవారు. కానీ, గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీ ఈ త‌ర‌హా ప‌రిస్థితిని కోల్పోయింది. పైకి అంతా బాగుంద‌ని చెబుతున్నా.. ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి మేడిపండుగా మారింద‌న్న వాస్త‌వాన్ని గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కేసీఆర్ కోసం ఎంత మంది నిల‌బ‌డుతున్నార‌న్న వాద‌న‌.. తెర‌మీదికి వ‌స్తే.. చెప్ప‌డం క‌ష్టంగా మారింది. ఇప్పుడు ఆయ‌న కోసం పెద్ద‌గా ప్ర‌జ‌లు నిల‌బ‌డే ప‌రిస్తితి రావ‌డం లేదు.

వ్య‌క్తి ఆధిప‌త్యం నుంచి..

వ్య‌క్తి ఆధిప‌త్యాన్ని ఉద్య‌మ స‌మ‌యంలో అంగీక‌రించిన తెలంగాణ ప్ర‌జ‌లు ఆనాడు కేసీఆర్ ఏం చెబితే అదే వేదంగా ప‌నిచేశారు. ఊరూవాడా కేసీఆర్ కోసం నిల‌బ‌డ్డాయి. కానీ.. ఇప్పుడు అదే వ్య‌క్తి ఆధిప‌త్యాన్ని తిర‌స్క‌రిస్తున్నారు. రాష్ట్రం కోసం ఏక‌మైన ప్ర‌జ‌లు.. కేసీఆర్ కోసం.. ఏకం అయ్యేందుకు స‌సేమిరా అంటున్నారు. ఈ తేడాను పార్టీ గ్ర‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇంకా కేసీఆర్ జ‌పం చేసుకుంటూ.. క్షేత్ర‌స్థాయి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గ‌మ‌నించ‌క‌పోతే.. గ‌త ప్రాభ‌వం మ‌రింత దెబ్బ‌తింటుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.