గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు ముఖ్యమైన విషయాల్లో ఆయన ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ప్రధానంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే అంశం, అదే విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో చంద్రశేఖర్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు స్వయంగా చంద్రబాబు పార్టీలో కీలక నాయకులకు చెప్పారు.
కేంద్రంలో మంత్రిగా ఉండటమే కాదు.. రాష్ట్రానికి సంబంధించిన నిధులను కూడా పెమ్మసాని తీసుకొస్తారని, ఈ బాధ్యత ఆయనకు అప్పగించాలని చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని చంద్రశేఖర్ కూడా తాజాగా మీడియా ముందు చెప్పారు. చంద్రబాబు తనకు భారీ హోంవర్క్ ఇచ్చారని అభివృద్ధి పనులు ముందుకు సాగేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యతను తన భుజాలపై పెట్టారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అదేవిధంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యంగా మారింది. గత 2019-24 ఎన్నికల్లో అమరావతి రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాబోయే 2029 ఎన్నికల్లో కూడా అమరావతి అంశం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో దీనికి చట్ట బద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్ ను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా దీనికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి అమరావతికి చట్టబద్ధత కల్పించేలాగా కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బాధ్యతను పెమ్మసాని చంద్రశేఖర కు చంద్రబాబు అప్పగించారు.
వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే దీనికి ఆమోదం పొందాలని భావించారు. అయితే కీలకమైన రెండు మూడు అంశాల్లో అమరావతి వ్యవహారం మళ్లీ వెనక్కి వచ్చింది. దీంతో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఈ బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా అమరావతికి చట్ట పద్ధతి కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి కసరత్తు బాధ్యతను చంద్రశేఖర్‌కు అప్పగించారు. దీంతో అదే నియోజకవర్గానికి చెందిన ఎంపీగా పెమ్మసాని అమరావతి చట్టబద్ధత బాధ్యతను తీసుకుంటున్నట్టు ప్రకటించడం విశేషం. మొత్తంగా ఈ రెండు విషయాల్లో పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించారని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates