మళ్ళీ మొదలైన కొలికపూడి వాట్సాప్ పంచాయతీ

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు. వరుసగా పెట్టే వాట్సాప్ స్టేటస్‌లు, స్థానిక నేతలపై తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. విస్న్నపేట టీడీపీ నేతలను ఉద్దేశించి “నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్‌కా?”, “పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటావ్… నిజంగా రాయల్, కొండపర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్!” అంటూ కసిరిపోయే వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో ఈ పోస్టులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే కొలికపూడి వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని వద్ద ఐదు కోట్లు తీసుకున్నారంటూ చేసిన సంచలన ఆరోపణలు టీడీపీలో ప్రకంపనలు రేపాయి. ఆ ఆరోపణలపై చిన్ని ఘాటుగా స్పందించడంతో వివాదం తీవ్రంగా మారింది. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం నివేదిక ఇచ్చి చంద్రబాబుకు అందజేయగా, ఇద్దరినీ పిలిచి పంచాయతీ చేసిన తర్వాత ఆ గొడవ ముగిసింది.

అయితే మళ్లీ ఇప్పుడు స్థానిక నేతలను టార్గెట్ చేస్తూ వాట్సాప్ స్టేటస్‌లలో ఆరోపణలు చేయడం పార్టీకి చికాకు కలిగిస్తోంది. నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడం, పార్టీకే నష్టం చేసేలా ప్రవర్తించడం అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.