వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసినట్టు తెలిసింది. గురువారం ఆమె పుట్టిన రోజు కావడతో మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో మాధురి బర్త్ డే పార్టీ ఇచ్చారు. దీనికి పలువురు వైసీపీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా హాజరయ్యారు.
అయితే.. ఈ పార్టీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం.. మద్యం తాగి చిందులు వేయడం, ఆర్కెస్ట్రా, డీజేలు పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్రవారం తెల్లవారు జామునే ఫామ్ హౌస్‌పై దాడి చేసిన రాజేంద్రనగర్ ఎస్ వోటీ పోలీసులు.. మాధురి సహా పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇదేసమయంలో పార్టీలో వినియోగించిన మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బర్త్ డే పార్టీలో స్మగుల్డ్ విదేశీ మద్యాన్ని వినియోగించినట్టు తెలిసింది. ఆ సీసాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్ డే పార్టీ నిర్వహించుకున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఇక, పార్టీలో మత్తు పదార్థాల వినియోగంపైనా దృష్టి పెట్టారు. అయితే.. అలాంటివేవీ లేదని తెలిసింది.
వైసీపీ నాయకుడైన దువ్వాడ శ్రీనివాస్.. మాధురిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర వివాదాలు కూడా జరిగాయి. 2024లో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురి నిపెళ్లి చేసుకున్న శ్రీనివాస్.. విడిగా ఉంటున్నారు. ఇటీవల ఆమె బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates