హైదరాబాద్‌లోని చరిత్రాత్మక విశ్వవిద్యాలయం.. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ). అనేక మంది మేధావులను మాత్రమే ఈ దేశానికి అందించడం కాదు.. అనేక ఉద్యమాలకు కూడా ఈ విశ్వవిద్యాలయం నిలువెత్తు సాక్ష్యం. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇక్కడి విద్యార్థులు కీలక రోల్ పోషించారు. అలాంటి విశ్వవిద్యాలయానికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల నిధులను ప్రకటించారు. అంతేకాదు.. ఆ వెంటనే జీవోను కూడా జారీ చేశారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి బుధవారం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తొలుత విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పిస్తామన్నారు. ఈ క్రమంలోనే 1000 కోట్ల రూపాయలను ప్రకటించారు. ఆ వెంటనే ఉన్నత విద్యా శాఖ జీవో కూడా ఇచ్చేసింది. ఈ నిధులను విశ్వవిద్యాలయం అభివృద్ధికి వినియోగించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
విద్యార్థులకు రాజకీయాలు అవసరమే కానీ.. ఎవరి ఉచ్చులో బడితే.. వారి ఉచ్చులో చిక్కుకోవద్దని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉస్మానియా విద్యాలయానికి ఒక చారిత్రక నేపథ్యంలో ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. అదేస్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు కూడా విద్యార్థులు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అనవసర రాజకీయ వివాదాల్లోకి చిక్కుకోవద్దని సీఎం సూచించారు.
“ఓయూకి వస్తానంటే.. కొందరు వారించారు. ఎందుకని కూడా ప్రశ్నించారు. కానీ, నేను అభిమానంతో ఇక్కడకు వచ్చాను. మన రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను ఇక్కడ నుంచే రాసుకునేందుకు వచ్చా“ అని విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఎదిగేందుకు ప్రభుత్వం ఎంత చేయాలో అంతా చేస్తుందని సీఎం వివరించారు. రాష్ట్రానికి, ప్రపంచానికి కూడా ఓయూ విద్యార్థులు ఐకాన్‌లుగా మారాలన్నదే తన సంకల్పమని రేవంత్ రెడ్డి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates