పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి రేపు మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. రెండు వారాల వ్యవధిలో కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు రేపుతో ముగియనుండటంతో, ఇద్దరూ కోర్టు ఆదేశాలను పాటించేందుకు రెడీ అయ్యారు.
ఈ ఏడాది మే 24న గుండ్లపాడు వద్ద టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ 6, ఏ 7 నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో పలువురు నిందితులను అరెస్ట్ చేయగా, పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు.
ముందస్తు బెయిలు కోసం వారు మొదట హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇద్దరికీ క్షణిక ఉపశమనంగా మధ్యంతర బెయిలు లభించింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇటీవల పిన్నెల్లి సోదరులకు ఇచ్చిన మధ్యంతర బెయిలును రద్దు చేస్తూ, ముందస్తు బెయిలు అర్హత లేదని స్పష్టం చేసింది. ఇద్దరూ రెండు వారాల లోపు సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశిస్తూ నవంబర్ 28న తీర్పు వెలువరించింది. ఆ గడువు రేపుతో ముగియడంతో, పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టుకు హాజరుకానున్నారు. లొంగిపోయిన తర్వాత కోర్టు వారి కస్టడీపై, తదుపరి దర్యాప్తు చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కొన్ని రోజుల క్రితం జగన్ ప్రెస్ మీట్ లో, ఈ హత్యకు పిన్నెల్లి కు ఎటువంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ కక్షతోనే కేసు పెట్టీ ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు లొంగిపోవడంతో జగన్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates