దేశాన్ని కుదిపేస్తున్న ఇండిగో విమానాల సంక్షోభంపై ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి స్పందించారు. సోమవారం రాత్రి ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో ఏపీ సీఎంగా కానీ.. టీడీపీ అధినేతగా కానీ.. తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఇది ఇండిగో సృష్టించిన సమస్యగా ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ(డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) విధించిన నిబంధనలను ఇండిగో పాటించలేదన్నారు. వాస్తవానికి గత ఏడాది నవంబరులోనే ఈ నిబంధనలు పాటించాలని కేంద్రం చెప్పిందన్నారు.
కానీ, ఈ విషయంలో ఇండిగో సంస్థ తప్పులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎలాంటి సంస్థ అయినా.. నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. కేంద్రం నిర్దేశించిన నిబంధనలు అమలు చేయకుండా.. ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన వ్యవహారం దారుణమని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం సహా పౌర విమానయాన శాఖ మంత్రి చూసుకుంటారని చెప్పారు. దీనిలో తన పాత్ర కానీ.. తన సలహాలు కానీ అవసరం లేదన్నారు. ఇక, కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిపై వస్తున్న విమర్శలను చంద్రబాబు తోసిపుచ్చారు. ఇది సరికాదన్నారు.
రాష్ట్రంలో కొందరు పనిలేని వారే ఆయనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడికి పార్లమెంటుకు, ప్రధానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఇంకెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు, ఆ పార్టీ ఎంపీలు డిల్లీలో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు సమర్థవంతంగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
అయితే..ఏపీలో వైసీపీ సహా కొన్ని చానెళ్లు దీనిని రాద్ధాంతం చేస్తున్నాయని.. రామ్మోహన్ నాయుడిపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శలు సరికావని.. రామ్మోహన్ నాయుడు నిరంతరం.. పనిచేస్తున్నారని చెప్పారు. కొత్త టెర్మినళ్ల నిర్మాణం, కొత్త విమానయాన సంస్థలకు అనుమతి కూడా ఇచ్చారని తెలిపారు. ఆయన పనితీరు తెలిసిన వారు ఎవరూ విమర్శించరని, ఒక సంక్షోభాన్ని కూడా రాజకీయాలకు వినియోగించుకోవడం సరికాదని ఎంపీలు వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates