కోనసీమ ప్రాంతం వల్లే ఉమ్మడి ఏపీ విడిపోయిందేమోనంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ పై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పవన్ కల్యాణ్ ఒకసారి చేగువేరా అంటాడని, ఒకసారి సనాతన ధర్మం అంటాడని..ఆయనకే ఓ క్లారిటీ లేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలీదని, ఒకసారి తెలంగాణ ఉద్యమం గొప్పదని అంటాడని, మరోసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 రోజులు అన్నం తినలేదని అంటాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో లేకపోతే పవన్ కల్యాణ్ కు బతుకు తెరువు లేదని అన్నారు. వారం వారం హైదరాబాద్ వచ్చి పవన్ సెటిల్మెంట్లు చేసుకుంటారని ఆరోపించారు.
సినిమాలు తీసేది, సంపాదించుకునేది, ఆస్తులు ఉన్నది తెలంగాణలో అని, ఒక సంవత్సరం పాటు హైదరాబాద్ మొఖం చూడకుండా ఉండగలరా అని పవన్ ను ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి పల్లెటూరు కోనసీమలా పచ్చగా మారిందని, ఆంధ్రా కన్నా ఎక్కువగా దేశంలో వరి పండించే నంబర్ వన్ రాష్ట్రం తమదని అన్నారు.
ఏపీలో సహజ వనరులు, సముద్రం ఉన్నాయని, వాటిని వాడుకొని అభివృద్ధి చేసుకోకుండా వాళ్లలో వాళ్లు కొట్టుకొని చస్తున్నారని విమర్శించారు. సంక్రాంతి పండుగకు 1 శాతం తెలంగాణ ప్రజలకు కోనసీమకు వెళ్లి ఉంటారని, మిగతా సమయాల్లో ఫ్రీగా బిర్యానీ పెడతామన్నా కోనసీమకు తెలంగాణ ప్రజలు వెళ్లరని చెప్పారు. అటువంటిది తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు మొండాలుగా మారాయని పవన్ అనడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇకనైనా, పవన్ , ఆంధ్రా నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు మానాలని, ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందే విధంగా ఒకరికొకరు సహకరించుకోవాలని హితవు పలికారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates