జనసేన పార్టీ ఎంపీల కు ఆ పార్టీ అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ టాస్క్ ను అప్పగించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో జనసేన ఎంపీలు ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఆయన దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా జనసేన కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి బంధాన్ని కాపాడుకుంటూనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకురావాలని ఆయన ఎంపీల కు సూచించారు.
జనసేనకు ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి విజయం సాధించిన వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లు పార్లమెంట్ లో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల పై పవన్ కళ్యాణ్ వారితో చర్చించారు. ఈ క్రమంలో తన శాఖకు సంబంధించిన పనులను పర్యవేక్షించడమే కాకుండా వాటికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కూడా సూచించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక సంఘం కేటాయించే మొత్తాలు నేరుగా పంచాయతీ ఖాతాలలోకి చేరతాయి. వీటిద్వారా పనులు చేపట్టాలి. ఇప్పుడు మరిన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చేలా పార్లమెంట్ ద్వారా ప్రయత్నించాలని ఆయన ఎంపీల కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు.
దీనికి మరొక కారణం కూడా ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం పెట్టనున్నారు. భారీ ఎత్తున నిధులు తీసుకురావడం ద్వారా పంచాయతీల్లో పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ జనసేన ఎంపీల కు బిగ్ టాస్క్ ఇచ్చారంటున్నారు పరిశీలకులు.
అదే సమయంలో అమరావతి రాజధాని, పోలవరం వంటి ముఖ్యమైన అంశాల్లో కూడా కూటమి ఎంపీల తో కలిసి కేంద్రంతో చర్చించాలని ఆయన సూచించారు. మొత్తం వ్యూహం బలంగా ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates