ఏపీపై ప్ర‌ధాని మోడీకి ఎన‌లేని ప్రేమ

భ‌విష్య‌త్తులో ఎక్క‌డైనా రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టాల‌ని అనుకునేవారికి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో 15 బ్యాంకులు, బీమా సంస్థ‌ల కార్యాల‌యాల ప్ర‌ధాన భ‌వ‌నాల‌కు ఆమె శంకు స్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. అమ‌రావ‌తి దేశ భ‌విష్య‌త్తు రాజ‌ధానుల‌కు త‌ల‌మానికంగా నిలుస్తుంద‌న్నారు.

రాజధాని అమరావతిని తిరిగి ప్రారంభించ‌డం సంతోషించ‌ద‌గిన విష‌య‌మ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. దేశంలో ఒక కొత్త రాజధాని నగరం నిర్మించటం సామాన్యమైన విషయం కాదన్న ఆమె.. నిర్మాణ పనుల విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ఎంతో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ని కొనియాడారు. రాజ‌ధాని పునఃప్రారంభానికి ప్రధాని మోడీ ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. “అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం లాంటింది. ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసా ఉండాలన్న నిర్ణయంతోనే పీఎస్‌యూ సంస్థలు ప్రధాన కార్యాలయాలు వస్తున్నాయి“ అని అన్నారు.

15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమ‌ని తెలిపారు. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదన్న ఆమె.. బ్యాంకులన్నీ రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాయ‌ని హామీ ఇచ్చారు. బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కావొద్దని సూచించారు.

ఏపీపై మోడీకి చాలా ప్రేమ‌!

ఏపీపై ప్ర‌ధాని మోడీకి ఎన‌లేని ప్రేమ అని నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా ప్రధాని మోడీ తక్షణమే స్పందిస్తార‌ని, ఏదైనా ప్ర‌పోజ‌ల్ పెడితే వెంటనే ఆయ‌న ఆమోదిస్తార‌ని తెలిపారు. విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా సహకరించాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారని తెలిపారు. క్వాంటం వ్యాలీ, ఏఐ  ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణ పొందేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. కేవలం ఐటీ గురించే కాకుండా ఆస్ట్రో ఫిజిక్స్ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తోందన్నారు.

ఏడాదిన్నరలో ఏపీ `ఫ్యూచరిస్టిక్ కేపిటల్`(భ‌విష్య ఆశ‌ల రాజ‌ధాని) నగరం అవుతుందని నిర్మ‌లా సీతా రామన్ చెప్పారు. అమరాతిలో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మించాలని కోరుతున్న‌ట్టు తెలిపారు. ఆచార్య నాగార్జునుడు లాంటి శాస్త్రీయ పరిశోధకులు నివసించిన ప్రాంతం కావ‌డంతో ఇలాంటి ప్లానెటోరియంల‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని తెలిపారు.