నేనే త‌ప్పుచేసి… నేనే కోర్టుకెళ్లానా?: సుబ్బారెడ్డి

“నేనే త‌ప్పు చేసి.. నేనే కోర్టుకువెళ్తానా?“ అని టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయంగా చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించిన ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప‌ర‌కామ‌ణి దొంగ‌త‌నం కేసు విష‌యంలో విచార‌ణ నిమిత్తం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన సుబ్బారెడ్డి .. అధికారుల ముందు హాజ‌ర‌య్యారు. అనంత‌రం.. బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ప‌ర‌కామ‌ణి కేసు గురించి కాకుండా.. క‌ల్తీ నెయ్యి గురించి మాట్లాడారు. త‌న హ‌యాంలో క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా అయింద‌న్న ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. తిరుమల లడ్డూలలో ఉపయోగించే నెయ్యి కల్తీపై ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. తప్పుడు సమాచారంతో  ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. తిరుమలను రాజకీయ వివాదాలలోకి లాగకూడ‌దంటూ.. సుప్రీంకోర్టు హెచ్చరిక చేసినప్పటికీ ఈ అంశాన్ని కొంద‌రు రాజ‌కీయంగానే వాడుకుంటున్నార‌ని తెలిపారు.

కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు ఉన్న‌ట్టు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఎటువంటి శాస్త్రీయ ధృవీకరణ లేద‌న్నారు.  “నేను తప్పు చేసి ఉంటే, నేను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తాను?” అని ఆయన ప్రశ్నించారు, అటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజా ప్రయోజనాల కోసం తాను కోర్టును ఆశ్రయించానని సుబ్బారెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశించిన త‌ర్వాత ఏర్పాటైన‌ సిట్ దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉందని, సిట్ ద‌ర్యాప్తు పూర్తికాకుండానే.. మీడియాలో సంచ‌ల‌నాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

“రెండు ప్రాథమిక ప్రశ్నలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. అనుమానిత నెయ్యి ట్యాంకర్ల ద్వారా వ‌చ్చిన నెయ్యిని ఎప్పుడైనా లడ్డూల‌లో ఉప‌యోగించారా? జంతువుల కొవ్వు ఉందా లేదా? అనే విష‌యాలు ఇప్ప‌టికీ సందేహంగానే ఉన్నాయ‌ని.. ఎటూ తెల‌లేదు.“ అని సుబ్బారెడ్డి చెప్పారు. దీనిపై టిటిడి స్పష్టమైన అధికారిక ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెయ్యి ట్యాంకర్ తప్పనిసరిగా ప్రయోగశాలకు వెళ్తుంద‌ని.. అనుమానాస్పద ట్యాంకర్లను వెన‌క్కి పంపేస్తార‌ని చెప్పారు.  అయినా.. త‌మ‌పై అభాండాలు వేస్తున్నారని అన్నారు. వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రైన చ‌ర్య అవుతుంద‌న్నారు.