ఇటు రాష్ట్రప్రభుత్వం అటు స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య ఏదో ఓ చిచ్చు లేకపోతే రెండువైపుల పెద్దలకు తోస్తున్నట్లు లేదు. నిత్యం ఏదో ఓ వివాదాన్ని రేకెత్తించటం దాని తర్వాత గవర్నర్ దగ్గరకో లేకపోతే హైకోర్టు, సుప్రింకోర్టులోనో పంచాయితీలు చేసుకోవటం మామూలైపోయింది. స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై తాజాగా అధికారపార్టీ అసెంబ్లీలో చేసిన తాజా తీర్మానంపై ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మండిపోతున్నారు. ఎన్నికల నిర్వహణ, తేదీల అధికారాలను రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన తర్వాతే కమీషనర్ నడుచుకునేట్లుగా తాజాగా తీర్మానం జరిగింది. దానిపై నిమ్మగడ్డ మండిపోతున్నారు.
అసెంబ్లీ తీర్మానంపై నిమ్మగడ్డ గవర్నర్ కు పెద్ద లేఖ రాశారు. స్టేట్ ఎలక్షన్ కమీషన్ అధికారాల్లోకి ప్రభుత్వం చొరబడుతోందంటూ ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ అన్నది పూర్తిగా ఎలక్షన్ కమీషన్ అధికారమని గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణ, తేదీల నిర్ణయం అన్నది స్వతంత్రప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమీషన్ అధికారమన్నారు. కాబట్టి ఈ విషయాల్లో కమీషన్ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని అడ్డుకోవాలంటూ గవర్నర్ కు సూచించారు. కమీషన్ అధికారాలపై గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా ఉదహరించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పంచాయితీరాజ్ చట్టం ప్రకారం స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ, తేదీల ప్రకటన అన్నది పూర్తిగా ఎన్నికల కమీషన్ అధికారంలోకి వస్తుందన్నది కాదనలేరు. కానీ ఎన్నికల నిర్వహించాలంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా అవసరం. ఐదేళ్ళ కాలపరిమితిలోగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత కమీషన్ పై ఉందనే విషయాన్ని తాజాగా నిమ్మగడ్డ తన లేఖలో గవర్నర్ కు గుర్తుచేశారు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. మరింత ఆలస్యం మంచిది కాదని అన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత వాదన చేస్తున్న నిమ్మగడ్డ ప్రభుత్వం సాయం లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న విషయాన్ని మరచిపోయారు. ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా కాకుండా కోర్టు ద్వారా మాత్రమే వ్యవహారాలు నడపాలని అనుకుంటున్నారు. మొన్నటి మార్చిలో జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఒక్కమాట ముందుగా చెప్పుంటే బాగుండేది.
ఎన్నికల వాయిదాపై ప్రభుత్వ ఆలోచన ఏదైనా నిమ్మగడ్డ తన నిర్ణయం తాను తీసుకునుంటే ఆయన్ను తప్పు పట్టే అవకాశమే ఉండేదికాదు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవద్దని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది. అయితే సంప్రదింపులంటే కేవలం సమాచారం ఇవ్వటం మాత్రమే అని తనదైన భాష్యాన్ని నిమ్మగడ్డ చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. సంప్రదించటానికి, సమాచారం మాత్రమే ఇవ్వమని చెప్పటానికి తేడా లేదా ? ఒకళ్ళ అధికారంలోకి మరొకళ్ళు, ఒకరిని గౌరవించుకోవాలని మరొకరికి లేకపోవటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. మరి తాజా వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates