తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 11, 14, 19 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. వాస్తవానికి ఇది పార్టీలు, అజెండా, జెండాల ప్రాతిపదికన జరిగే ఎన్నిక కాదు. అయినా.. ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీలు ముందుగానే అలెర్ట్ అయ్యాయి. బీఆర్ ఎస్ నాయకులు ఇప్పటికే గ్రామ పర్యటనలు చేపట్టి రైతుల సమస్యలను, పంటల సమస్యలను ప్రస్తావించారు. రైతు భరోసా వంటి కీలక అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు.
ఇక, అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఇప్పటికే మహిళలను ఆకట్టుకునేందుకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టింది. ఇలా.. ఎవరికి వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. పైకి ఎన్నికల ప్రచారం అని చెప్పకపోయినా.. సోమవారం నుంచి ఆయన వచ్చే నెల 9వ తేదీ వరకు జిల్లాల్లోనే పర్యటించనున్నారు. కాంగ్రెస్‌పార్టీకి బలమైన జిల్లాలుగా పేరున్న వాటిలో ఆయన పర్యటించి సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన నేపథ్యంలో ఈ పర్యటన చేపడుతున్నట్టు చెబుతున్నారు.
అదేసమయంలో గ్రామ పంచాయతీల్లో సీఎం పర్యటించరని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నగరాలు, మునిసిపాలిటీలకు మాత్రమే సీఎం పర్యటన పరిమితం అవుతుందని అంటున్నాయి. సోమవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ప్రారంభమయ్యే సీఎం రేవంత్ పర్యటన.. ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సాగనుంది. మొత్తంగా ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఎలా చూసినా.. పైకి ఎన్నికల ప్రచారం కాదని అన్నా.. పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేయాలన్న వ్యూహం ఉందని బీఆర్ ఎస్ నాయకులు వ్యాఖ్యాని్స్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates