శ్రీవెంకటేశ్వరస్వామి పాదాల చెంత పుట్టిపెరిగా.. స్వామివారికి అప్రతిష్ట తెచ్చే ఏ పని నేను చేయను.. ఎవరినీ చేయనివ్వను.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు దశల్లో రూ.260 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
ఒక పవిత్ర దేవాలయమైన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సంకల్పించాం అన్నారు. ఈ ప్రాంత రైతులను ఈ దేవుడి సన్నిధి నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఇక్కడి రైతులు సహకరించి 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారని గుర్తు చేశారు. 25 ఎకరాల్లో పవిత్రమైన ప్రదేశం, కృష్ణానది ఒడ్డున వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం అని తెలిపారు.
ఈ అమరావతి విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. దేవతల రాజధానిగా అమరావతి ఏవిధంగా ఉంటుందో.. ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వేంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుంటే 23 క్లేమోర్ మైన్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తే ఆ వెంకటేశ్వరుడు నాకు ప్రాణభిక్ష పెట్టారు అని తెలిపారు. తాను ఎప్పుడు తిరుపతి వెళ్లినా క్యూలైన్లోనే భక్తితో వెళ్తాను… దేవుడి దగ్గరకు పెత్తందారుగా వెళ్లకూడదు. తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే స్వామి శిక్షిస్తారు అని సీఎం అన్నారు.
గత ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేసిన సందర్భాలు లేవు. మంచి సంకల్పంతో రైతులు భూములు ఇస్తే నరకాన్ని చూపించారు. మీరు వేంకటేశ్వరస్వామిని నమ్ముకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర చేసి రాజధానిని కాపాడుకోవడానికి పాటుపడ్డారు. ఈ పవిత్రమైన దేవాలయాలయాన్ని రూ.260 కోట్లతో పూర్తి చేస్తాం అన్నారు. అమరావతినే కాకుండా, ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తిఈ దేవాలయానికి ఉందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates