రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. పొరుగున ఉన్న కర్ణాటకతోనూ.. వివాదంగా మారిన నదీ జలాల సమ స్యపై ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఆయన స్పందిస్తున్నా.. ఆయా నదుల విషయంలో మిగులు జలాలుగా ఉన్న.. ముఖ్యంగా సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని వడిసి పట్టుకుని `అందరం` సద్వినియోగం చేసుకుందామని చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో తెలంగాణ, కర్ణాటకలు.. తమ వాదనకే పరిమితం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కృష్ణానది జలాల విషయంలో పునః సమీక్షించాలని.. తమకు వాటా పెంచాలని కర్ణాటక ప్రభుత్వం, ఇక, అసలు ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే కృష్ణాజలాల కేటాయింపు జరిగిందని.. బచావత్ అవార్డు అనేది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత.. జలాల కేటాయింపు జరగలేదని.. కాబట్టి.. ఇప్పుడు కృష్ణానది వాటాల జలాలను సమీక్షించి.. తమకు పెరిగిన ఆయకట్టు మేరకు.. కేటాయింపులు కొత్తగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
అయితే.. ఈ వ్యవహారంపై ఏపీ వాదన ఇప్పటి వరకు పెద్దగా వినిపించలేదు. కేంద్రానికి ఈ విషయాన్ని విన్నవించామని రాష్ట్ర జలవనరుల శాఖ చెబుతోంది. అయితే.. తాజాగా తెలంగాణ సర్కారు ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపైనే ఇటీవల వైసీపీ అధినేత జగన్ కూడా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కృష్ణాజలాలను పునః సమీక్షిస్తే.. ఏపీకి ముఖ్యంగా సీమ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబుకు లేఖ సుదీర్ఘ రాశారు. మరోవైపు.. సుప్రీంకోర్టులోనూ ఈ వ్యవషహారం విచారణకు రానుంది.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి .. జలవనరుల శాఖ అధికారులతో కృష్ణానది జలాల వ్యవహారంపై సమీక్షించిన చంద్రబాబు.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. కృష్ణానది జలాల పునః సమీక్షకు ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలన్నారు. అంతేకాదు.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపుల మేరకు నీటి వినియోగం చేసుకుంటున్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు వివరించాలన్నారు. అదేసమయంలో వృథా నీటిని వినియోగించుకునే విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెలపాలన్నారు. బలమైన వాదనలు వినిపించే బాధ్యతను జలవనరుల శాఖ తీసుకోవాలని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates