దేవతల రాజధాని మాదిరిగానే అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక్కడ అన్ని వర్గాలకు నివసించేందుకు ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుందన్నారు. అమరావతి రాజధాని పరిధిలో నిర్మిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీవారి ఆలయం రెండో దశ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు భూమి పూజ చేశారు.
ఇప్పటికే 140 కోట్ల రూపాయల వ్యయంతో తొలి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో 260 కోట్ల రూపాయ ల వ్యయం కాగల పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఈరోజు జరి గిన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ నిర్మాణాల్లో ఆలయ ప్రాకారం, మహాగోపురం, ఆలయ విస్తరణ వంటివి ఉన్నాయి. వీటిని రెండు నుంచి మూడు దశల్లో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలకు భూమి పూజ చేసిన అనంతరం.. సీఎం మాట్లాడారు.
రాష్ట్రంలో రాజధాని ప్రాధాన్యం ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు. గతంలో కొందరు తప్పులు చేశారని.. వెం టనే శ్రీవారు అలాంటి వారిని శిక్షించారని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వారికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం తెలిపారు.
రాష్ట్ర రాజధాని అంటే కేవలం ఒక ప్రాంతం కాదన్న చంద్రబాబు.. ఇదొక మహానగరమని వ్యాఖ్యానించారు. దేశానికే తలమానికంగా దీనిని తీర్చిదిద్దనున్నట్టు సీఎం చెప్పారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కార్మి కులు ఇక్కడ రేయింబవళ్లు కష్టపడుతున్నారని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రాజధానిని దేశానికి తలమానికంగా నిర్మించనున్నట్టు తెలిపారు. తొలిదశ పనులు 2027 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates