టీఆర్ఎస్ ను ముంచెత్తిన ‘వరద’

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను వరద సమస్య ముంచెత్తినట్లు అర్దమవుతోంది. వరద దెబ్బకు కొత్త అభ్యర్దులే కాదు సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోయారు. ఈ స్ధాయిలో తమ అభ్యర్ధులను ముంచెత్తుతుందని బహుశా అధికారపార్టీ అగ్రనేతలు కూడా ఊహించుండరు. ఎందుకంటే ఇదే సమస్య ఎన్నికల్లో చర్చకు వచ్చినపుడు బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయిన్ చేసిన కేటీయార్ కొట్టిపారేశారు.

తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే జనాలు అనుకుంటున్నది, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలే నిజాలని తేలిపోయింది. ఎందుకంటే అక్టోబర్లో కురిసి భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలోని 24 డివిజన్లలో బాగా దెబ్బతిన్నది. కొన్ని వందల కాలనీలు వర్షపు నీటిలో ముణిగిపోయాయి. ఈ ప్రాంతాల్లోని ఇళ్ళల్లో చాలామంది తమ ఇళ్ళను వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. బాధితులను పరామర్శించటానికి కానీ సమస్యల పరిష్కారానికి అధికారపార్టీ కార్పొరేటర్లు కానీ నేతలు కానీ ఎవరు అడ్రస్ కనబడేలేదు.

అయితే ఎన్నికలు ప్రకటన కాగానే మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో సహా యావత్ పార్టీ ప్రముఖలంతా వచ్చి వాలిపోయారు. వర్షాల కారణంగా సమస్యల్లో తమ ఖర్మానికి తమను వదిలేసి ఎన్నికలు రాగానే వచ్చిన పార్టీ, ప్రభుత్వ పెద్దలపై జనాలు విరుచుకుపడిపోయారు. ప్రచారానికి వచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలను తమ కాలనీల్లోకే జనాలు రానీయలేదు.

అప్పుడైనా జనాల్లోని ఆగ్రహాన్ని అధికారపార్టీ నేతలు అర్ధం చేసుకునుండాల్సింది. అర్ధం చేసుకోకపోగా బీజేపీ నేతలపై ఎదురుదాడులు మొదలుపెట్టారు. అలాగే బాధితులను ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకున్నట్లుగా కేటీయార్ అండ్ కో కలరింగ్ ఇచ్చారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే వరద ప్రభావంలో టీఆర్ఎస్ ముణిగిపోయిందన్న విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే 24 డివిజన్లలో 17 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయారు.

భారీ వర్షాలకు రామాంతపూర్, హబ్సిగూడ, సుభాష్ నగర్, మల్లాపూర్, ఏఎస్ రావునగర్, జీడిమెట్ల, చంపాపేట, నాగోలు, సరూర్ నగర్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, హయత్ నగర్, వనస్ధలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, శాస్త్రీనగర్ లాంటి అనేక డివిజన్లలో అధికారపార్టీ ఓడిపోయింది. బాధితులకు ప్రభుత్వం రూ. 10 ఇచ్చిందని కేసీయార్, కేటీయార్ చెప్పినా అందులో సగం కూడా బాధితులకు అందలేదట. అలాగే అభ్యర్ధులకు, మంత్రులు, ఎంఎల్ఏలకు పడకపోవటం లాంటి అనేక కారణాలతో టీఆర్ఎస్ నిండా ముణిగిపోయిందన్నది వాస్తవం.