ఏపీలో ఇద్దరు ముఖ్య నేతలు ఈరోజు పొలం బాట పట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికార, విపక్ష నాయకులు వేరువేరుగా అన్నదాతలతో సమావేశం. అయ్యారు. శంకరగుప్తంలో సముద్రపు నీరు చేరి పాడవుతున్న కొబ్బరితోటలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కొబ్బరితోటల సమస్యల గురించి అవి దెబ్బతింటున్న పరిస్థితుల గురించి స్థానికులతో, రైతులతో, సంబంధిత అధికారాలతో మాట్లాడారు. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గం బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను మాజీ సీఎం జగన్ పరిశీలించారు. అరటికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు.
‘నేనేదో ఇప్పుడు తాత్కాలిక పరిష్కారంగా ఒక 20 కోట్లు ఇచ్చేసి, మీతో చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోవడానికి చూడట్లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి…’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖాముఖిలో ఆయన రైతులతో చర్చించారు. మొత్తం కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతాంగానికి సంబంధించి శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి సమావేశమే అన్నారు. మీరు ఇంత కష్టపడేది మీ బిడ్డలకోసమే.. ఇక్కడున్న రైతుల బిడ్డలు ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ల వయస్కులే ఉండి ఉండొచ్చు. వారికి మంచి భవిష్యత్తు అందించడం కోసం మీరు పడే తపనే నేను పడుతున్నాను అని పవన్ అన్నారు. మీ ఆదాయమార్గం, మీ వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు అవరోధాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నా అని హామీ ఇచ్చారు.
అదే విధంగా బ్రాహ్మణపల్లి లో అరటి రైతులతో సమావేశమైన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. మా హయాంలో అరటి రైతుల కోసం రైళ్లు నడిపాం అని తెలిపారు. అనంతపురం ఢిల్లీ, తాడిపత్రి-ముంబై రైళ్లు నడిపాం. మా హయాంలో 3 లక్షల టన్నులు ఎక్స్ పోర్ట్ చేశాం.. అరటి పంటపై కేంద్ర నుంచి అవార్డులు తీసుకున్నాం.. ఇప్పుడు అరటి ఎక్స్ పోర్ట్ అనేదే జరగడం లేదు.. అని ఆయన వివరించారు. ఈ ప్రభుత్వంలో రైతు అంటే ప్రేమ లేదు. మా హయాంలో టన్ను రూ.30వేలకు పైగా పలికింది.. ఇప్పుడు రూ.2వేలకు కూడా కొనేవాడు లేడు అని జగన్ ఆరోపించారు. మొత్తం మీద ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పొలాల్లో పర్యటించడం ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates