ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని బీజేపీ నేతల లక్ష్యం ఒక్కటే. తమ పార్టీ గెలుపు గుర్రం ఎక్కి.. అధికారంలోకి రావాలి. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమించాలి. లక్ష్యం పెద్దది, మంచిదే అయినా.. దీని సాధనలో మాత్రం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఎక్కడ ఎలా వ్యవహరించాలో.. పార్టీ నేతలతో ఎలా కలివిడిగా ఉండాలో.. తెలిసిన నాయకుడిగా బండి సంజయ్ పేరు మార్మోగుతోంది. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. బండి సంజయ్కు ఎదురైన రెండు ఎన్నికలు.. ఒకటి దుబ్బాక ఉప ఎన్నిక, రెండు గ్రేటర్ మునిసిపల్ ఎన్నికలు.
ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ దూకుడు పెంచిన నాయకుడిగా ఖచ్చితంగా క్రెడిట్ బండి సంజయ్కు ద క్కుతుంది. ఊహించని విజయాన్ని ఆయన దుబ్బాకలో అందించారనే చెప్పాలి. నిజానికి ఇక్కడ సెంటి మెంట్ ప్లే అవుతుందని అనుకున్నారు. అలాంటి దుబ్బాకలో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక, గ్రేటర్లోనూ నాలుగు స్థానాల నుంచి 40 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ రేసు గుర్రాన్ని తలపించింది. ఈ మొత్తానికి కారణం.. క్షేత్రస్థాయి అభ్యర్థుల సత్తా మాత్రమే కన్నా.. రాష్ట్ర పార్టీ చీఫ్గా బీజేపీ నేత సంజయ్ వ్యూహం.. చక్కగా పనిచేసిందనే చెప్పాలి.
ప్రభుత్వంపై ఆయన ఎత్తిన విమర్శల కత్తి.. పదును తేలింది. అదేవిధంగా ప్రజా సమస్యలను స్పృశించడంలోను.. ప్రజల్లో నైతిక బలం పెంచడంలోనూ.. తన పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించడంలోనూ సంజయ్ దూకుడు మామూలుగా లేదని ఎన్నికల ప్రచార సమయంలోనే వినిపించింది ఇక, అది ఫలితాలతో రుజువైంది. కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీ గురించి చర్చ సాగుతోంది. ఏపీలోనూ బీజేపీ సారథి సోము వీర్రాజు కొన్ని నెలల కిందటే పగ్గాలు చేపట్టారు. అయితే.. ఎక్కడా దూకుడు లేదు. ప్రభుత్వలోపాలను ఎత్తి చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపించడంలేదు.
విమర్శల విషయంలో వీర్రాజు అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షాన్నిటార్గెట్ చేసుకున్నారు. ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడంలోనూ సోము సక్సెస్ కాలేక పోతున్నారు. అన్నిటికన్నా మించి.. అందరినీ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవడంలోను వీర్రాజు విఫలమవుతున్నారనే వాదన ఉంది. ఇక, త్వరలోనే జరగనున్న తిరుపతి ఉప ఎన్నిక.. రాష్ట్ర బీజేపీకి, ముఖ్యంగా వీర్రాజు నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారనుందనేది ఖాయం అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో.. చూడాలి.