ప్రజల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కమిటీ

ఏపీ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని సంర‌క్షించేందుకు సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తూనే.. యూనివ‌ర్సల్ హెల్త్ స్కీంను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు. దీంతో పాటుకేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని కూడా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. వీటిలో 2 ల‌క్ష‌ల నుంచి రూ.20ల‌క్ష‌ల వ‌ర‌కు రోగుల‌కు ప్ర‌భుత్వం నుంచి బీమా స‌దుపాయం అందుబాటులోకి రానుంది. అయితే.. ఈ విష‌యంలో మ‌రింత మెరుగైన విధానం కోసం ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తోనూ సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. అంత‌ర్జాతీయ నిపుణుల‌తో కూడిన ఒక క‌మిటీని ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన ఆరోగ్య భ‌ద్ర‌తను క‌ల్పించాల‌ని భావిస్తున్నారు. ఈ క‌మిటీలో ప‌ది మంది వ‌ర‌కు అంత‌ర్జాతీయ వైద్య నిపుణులు ఉంటారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి.. ప్ర‌భుత్వానికి త‌గు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తారు. దీంతోపాటు ఏయే ప్రాంతాల్లో ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యంపైనా అధ్య‌య‌నం చేస్తారు. వ‌చ్చే మూడేళ్ల కాలానికి అంత‌ర్జాతీయ నిపుణుల‌ను ప్ర‌భుత్వం గౌర‌వ వేత‌నం, వ‌స‌తి, ర‌వాణా స‌దుపాయాల‌తో కూడిన సౌక‌ర్యాలు అందించి నియ‌మించుకుంటుంది.

ప్ర‌స్తుతం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ర‌క‌మైన రోగాలు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు శ్రీకాకుళంలోని ఉద్దానంలో కిడ్నీ స‌మ‌స్య‌, ఏలూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో బోద‌కాలు, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో చ‌ర్మ వ్యాధులు, కేన్స‌ర్ ప్ర‌బ‌లుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ నిపుణులు ఆయా అంశాల‌పై చ‌ర్చిస్తారు. త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా చేయ‌నున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న మూడు ఆరోగ్య ప‌థ‌కాల‌పైనా అవి స‌మీక్ష చేయ‌నున్నాయి. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సంర‌క్ష‌ణ విధానాలు అందించ‌డ‌మే ధ్యేయంగా ఈ నిపుణుల క‌మిటీ ప‌నిచేయ‌నుంది.

ఎక్కువ మందికి ప్ర‌యోజ‌నం క‌లిగించే నూత‌న విధానాన్ని సూచించినా.. ప్ర‌భుత్వం దానిని అమ‌లు చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అంతేకాదు.. ఈ నిపుణుల క‌మిటీలో రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖ వైద్యుల‌తోపాటు.. స‌ల‌హాదారులు, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఉంటారు. ఈ క‌మిటీకి సీఎం చంద్ర‌బాబు నేతృత్వం వ‌హిస్తారు. ప్ర‌తి మూడు మాసాల‌కు ఒక‌సారి ఈ క‌మిటీ విధిగా స‌మావేశ‌మై.. రాష్ట్రంలో వైద్య తీరును, రోగుల ఆరోగ్యాన్ని స‌మీక్షిస్తుంది. మెరుగైన వైద్య విధానాల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.