మూర్తీభవించిన సేవాగుణం సత్యసాయి శతజయంతి

మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీకగా నిలిచిన సత్యసాయి గురించి అన్నీ తెలియకపోయినా కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. నేడు నవంబర్ 19 ఆయన శతజయంతి. ఈ సందర్బంగా పుట్టపర్తిలోని సత్యసాయి నిలయాల్లో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక మంది ప్రముఖులు సత్యసాయి సేవలను అభినందిస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక్కసారిగా ఏర్పడినవి కావు.

సత్యసాయి నెలకొల్పిన సేవాసంస్థలు విద్యాసంస్థలు వైద్య సంస్థలు ఇవన్నీ నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సేవలు అందిస్తున్నాయి. “నేను తీసుకువచ్చింది ఏమీలేదు తీసుకువెళ్లేది కూడా ఏమీలేదు” అని చెప్పిన సత్యసాయి స్థాపించిన సెంట్రల్ ఆస్తుల విలువ నేడు లక్షల కోట్ల రూపాయలు. కొన్ని వ్యవస్థలకు పన్నులు లేకపోవడం కూడా ఆశ్చర్యమే. దీనికి స్పష్టమైన కారణం ప్రభుత్వాలకంటే ఎక్కువగా సత్యసాయి చేసిన నిస్వార్థ సేవ.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక గ్రామాలు ఒకప్పుడు నీటి కొరతతో ఖాళీ అయ్యాయి. ఈ సమస్యపై ప్రభుత్వాలు సంవత్సరాల పాటు ప్రయత్నించినా అంతగా పరిష్కారం కనిపించలేదు. అప్పుడు సత్యసాయి ముందుకు వచ్చి ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపించారు. సుమారు 200 గ్రామాలకు 300 కిలోమీటర్ల పైపులైన్ వేసి కృష్ణా జలాలను అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1995లోనే దీనికి 350 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆయన పట్టుదల అంత గొప్పది.

ఇదే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు మరియు బెంగళూరు శివార్లకు కూడా తాగునీరు అందించారు. వైద్య సేవలను అత్యంత ఆధునాతనంగా రూపొందించారు. ఇక్కడ పేద ధనిక అనే తేడా లేదు. ప్రపంచం నలుమూలల నుంచి ఎవరొచ్చినా ఏ వ్యాధికైనా పూర్తిగా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చయినా ఒక్క రూపాయి కూడా తీసుకోరు.

తిరుమలలో అన్నప్రసాదం అందించినట్లుగానే సత్యసాయి నిలయాల్లో కూడా ప్రతిరోజూ వేల మందికి భోజనం వడ్డిస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 200 గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.