ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలకమైన నియోజకవర్గం గన్నవరం. గత రెండు దశాబ్దాలుగా.. ఇక్కడి రాజకీయం.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంవీ చుట్టూనే తిరిగింది. వరుస విజయాలతో ఆయన ఇక్కడ ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించారన్న టాక్ కూడా ఉంది. గత 2019 ఎన్నికలలో విజయం దక్కించుకున్న వంశీ.. తర్వాత.. వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత.. తనకు రాజకీయంగా భిక్ష పెట్టిన టీడీపీ పైనే విమర్శలు చేశారు. పార్టీ అధినేత కుటుంబాన్ని కూడా విమర్శించారన్న వాదన ఉంది.
ఈ క్రమంలోనే గత 2024 ఎన్నికల్లో వంశీ వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక, అదే ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన యార్లగడ్డ వెంకట్రావు విజయం దక్కించుకున్నారు. అయితే.. వెంకట్రావు తొలిసారి విజయం దక్కించుకున్నారు. దీంతో వంశీ హవాను ఎదుర్కొనడంతోపాటు.. ఆయన సానుభూతిపరులను.. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలోని వంశీ అనుకూల వర్గాన్ని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారన్నది వాస్తవం. దీనిలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు.
అంతేకాదు.. గతంలో కంటే కూడా.. ఇప్పుడు పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. సమస్య ఏదైనా.. అది పెద్దదా.. చిన్నదా.. అన్నదాంతో సంబంధం లేకుండా ఎవరు వెళ్లినా.. ఆయన పట్టించుకుంటున్నారు పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకు మంచి మార్కులు వేసేలా చేస్తోంది. ఇక, వ్యక్తిత్వం పరంగా కూడా.. పెద్దగా వివాదాలు.. విమర్శలకు అవకాశం లేకుండా వెంకట్రావు వ్యవహరిస్తున్నారు.
రాజకీయ పరమైన కార్యక్రమాల కంటే కూడా.. ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు వెంకట్రావు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు.. మండల ప్రాంతాల్లో ఎక్కవగా ఉంటున్నారు. సాగు సమస్యల నుంచి.. రహదారుల నిర్మాణం వరకు అన్నీ తానై స్వయంగా చూస్తున్నారు. ఈ పరిణామాలు గతంలో కనిపించలేదని.. స్థానికులు చెబుతుండడం ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతోంది. అంతేకాదు.. గత ఎమ్మెల్యే వంశీ.. నియోజకవర్గంలో కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండేవారు. కానీ, వెంకట్రావ్ మాత్రం 70 శాతం నియోజకవర్గంలోనే ఉంటున్నారని స్థానికులు చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates