జమ్మలమడుగులో ఏం జరుగుతోంది.. టిడిపి ఆరా..!

ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మారుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసిపి ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.. నాయకుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది అనే అంశాలపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. వాస్తవానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా వరుసగా నికరమైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది.

2014 19 ఎన్నికల్లో వైసిపి వరుసగా విజయాలు సాధించినప్పటికీ గత ఎన్నికల్లో బిజెపి విజయం దక్కించుకోవడం విశేషం. అంటే ఒకరకంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రజలు ఒక పార్టీకే అనుకూలంగా ఉంటారనే విషయం స్పష్టత లేకుండా పోయింది. దీంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో పాటు గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైసిపి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇంచార్జిలను మార్చడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు సాగుతోంది.

దీనిని గమనించిన టిడిపి వెంటనే అప్రమత్తమైంది. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.. టిడిపి హవా ఏ విధంగా ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం టిడిపి ఇంచార్జిగా భూపేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు మార్గం కూడా సుగమం అయింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి తన పోటీ నుంచి తప్పుకుంటానని కూడా ప్రకటించారు. భూపేష్ రెడ్డికి మద్దతు ఇస్తానని కూడా చెప్పారు.

అయితే వైసిపి వేస్తున్న అడుగులు విభిన్నంగా ఉండడం ఇంచార్జిలను మార్చడం ద్వారా రాజకీయంగా పుంజుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో టిడిపి బలాబలాలు అదేవిధంగా ప్రజల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలో నివేదిక కోరుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాయకులకు సమాచారం అందించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే అభ్యర్థిని మార్చే దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.