ఏమిటో ఈ మార్పు… పిలిచి మరీ ఓదార్పు!

ఓటమి తర్వాత ఓఏడాది పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరుకే పరిమితం అయి అప్పుడప్పుడూ తాడేపల్లికి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత అడపా దడపా పరామర్శల పేరుతో పర్యటనలు చేపట్టారు. ఆ సమయంలోనే ప్రజలను కలుస్తున్నారు. అయితే రెండు మూడు రోజులుగా తాడేపల్లిలో తనను కలిసేందుకు ప్రజలకు అవకాశం ఇస్తున్నారు. ప్రజలకు దూరంగా ఉంటున్నారనే అపవాదును తుడిచి వేసేందుకు ఆయన ఈ కార్యక్రమం చేపట్టినట్లు పలువురు భావిస్తున్నారు.

వైఎస్ జగన్ లో ఈ మధ్య వచ్చిన ఈ మార్పును ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో సమయం ఉన్నప్పుడల్లా ప్రజలను కలుస్తున్నారు. ఆయనకు తమ సమస్యలు వినిపించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. రెండు రోజుల నుంచి ప్రజలు జగన్ ను కలవడం.. లోకేష్ ప్రజాదర్బార్ ను గుర్తు చేస్తుందని విశ్లేషకులు ఆంటున్నారు. 

జగన్ జనం.. ఈ బంధం విడదీయలేని అంటూ వైసీపీ అనుకూల మీడియా హోరెత్తిస్తోంది. ప్రజలు జగన్ ను తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసిన ఫోటోలను షేర్ చేస్తోంది. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన జనం అంటూ వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. దివ్యాంగులతో పాటు కార్యకర్తలు, రైతులు, ప్రజల సమస్యల్ని వైయస్ జగన్ సావధానంగా విని.. బాధితులకి భరోసా ఇస్తున్నారంటూ పేర్కొంది.

జగన్ అధికారంలో ఉన్నపుడు ఇలా ప్రజలను కలిసిన సందర్భం లేదు. జనంలోకి వెళ్ళినా పరదాలు కట్టుకుని మరీ వెళ్లారనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో పులివెందులలో తనను ప్రజలు కలిసేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తాడేపల్లి ప్రజలను కలుస్తున్నారు. దీంతో జగన్ నేలపైకి దిగి వచ్చారా అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.