వైసీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే.. వారిపై నిబంధనల ఉల్లంఘనల పేరుతో కేసులు నమోదవుతున్నాయి. మాజీ మంత్రుల నుంచి ఇతర నాయకుల వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.
ఎందుకంటే.. నాయకులు, మాజీ మంత్రులపై కేసులు నమోదవుతున్నా.. వారు ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటున్నారు. లాయర్లను పెట్టుకుని ఆయా కేసుల నుంచి బయట పడుతున్నారు. లేదా.. వాయిదాలు తెచ్చుకుంటున్నారు. కానీ.. కార్యకర్తల విషయానికి వస్తే మాత్రం.. వారిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. కేసుల్లో భాగంగా పోలీసులు కార్యకర్తలను తీసుకువచ్చి విచారిస్తున్నారు. దీంతో రోజుల తరబడి వారు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ పరిణామాలపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో తమకు మద్దతు లేకుండా పోయిందని, తమను నిరసనలు, ధర్నాలకు పిలుస్తున్న నాయకులు కేసులు నమోదైతే మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా జగన్ కనీసం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విదంగా కూడా వ్యవహరించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలా అయితే.. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు తాము దూరంగా ఉంటామని కూడా చెబుతున్నారు.
గతంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్లకు తరలించినప్పుడు చంద్రబాబు న్యాయ వాదులను పురమాయించి.. వారిని బయటకు తీసుకువచ్చిన విషయాన్ని వైసీపీకార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తమకు కనీసం ఈ మాత్రపు ఆదరణ కూడా లభించడం లేదని వాపోతున్నారు. జగన్ ఇంటికే పరిమితమై.. కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారని.. తాము మాత్రం ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారు. దీనిపై జగన్ ఆలోచన చేయాలని కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates