రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి సందేహాలు అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా గురువారం ఉదయం ఆయన విశాఖలో యూరప్ దేశాలకు చెందిన పెట్టుబడి దారులతో ఓ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతు.. అనేక మందికి రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందేమోనన్న సందేహం ఉందని.. అలాంటి దేమీ జరగదని.. దీనికి తాను గ్యారెంటీ ఇస్తానని తెలిపారు.
“ప్రస్తుతం .. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. వారికి తెలుసు.. ఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందో. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వం మారదు. మీరు నిశ్చింతగా పెట్టుబడులు పెట్టండి“ అని చంద్రబాబు వివరించారు. పెట్టుబడులు పెట్టేవారికి తక్షణమే అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. బలమైన ప్రభుత్వం ఉందని.. మళ్లీ మళ్లీ కూడా అధికారంలోకి వస్తుందని.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. భూములు, నీళ్లు, విద్యుత్, పన్నులు సహా.. అనేక విషయాల్లో రాయితీలు కల్పిస్తున్నామన్నారు. విద్యావంతులైన యువత అందుబాటులో ఉన్నారని.. మ్యాన్ పవర్ కు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతోందన్న సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం మారుతుందేమోనన్న సందేహాన్ని ఈ క్షణమే వదిలి వేయాలని సూచించారు. ప్రజల్లో వచ్చిన మార్పులను గమనించాలన్నారు. ఇండియా-యూరప్ దేశాల మధ్య అనేక సంబంధాలు కొనసాగుతున్నాయన్న సీఎం.. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా.. అనేక రూపాల్లో ఇరు పక్షాలకు మేలు జరుగుతుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలతో ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates