క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే టీడీపీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపిగా అతికష్టం మీద గెలిచారు. వైసీపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ మీద నాని గెలిచింది కేవలం 6 వేల ఓట్లతోనే. సరే 60 వేలైనా 6 వేలైనా గెలుపు గెలుపే అన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే నాని గెలిచారో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పటి నుండే పార్టీతో సమస్యలు మొదలైందట.
తన ఓటమికి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రయత్నించారనేది కేశినేని ఆరోపణ. అందుకనే దేవినేనంటే ఎంపి మహా మంటగా ఉంటున్నారు. కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాలు మొత్తాన్ని చంద్రబాబేమో దేవినేని చేతిలోనే పెట్టారు. దాంతో ఎంపికి ప్రతిరోజు దేవినేనితోనో లేకపోతే ఆయన వర్గంతోనే గొడవలు జరుగుతునే ఉన్నాయి. కంట్రోలు తప్పిన కోపంతో కేశినేని ఒక్కోసారి చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ మీద కూడా విమర్శలు చేయటం పార్టీలు సంచలనంగా మారింది. దాంతో చంద్రబాబుకు కూడా విసుగొచ్చేసి ఎంపిని దూరంగా పెట్టేస్తన్నారని సమాచారం.
ఎప్పుడైతే చంద్రబాబే స్వయంగా ఎంపిని దూరం పెట్టేస్తున్నట్లు గ్రహించారో అప్పటి నుండి పార్టీ నేతలు కూడా దూరంగా పెట్టారట. విజయవాడ లారీ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు ఈమధ్య సమావేశమై గౌరవాధ్యక్షునిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని డిసైడ్ చేశారట. కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని అంటే అర్ధమేంటంటే ఇఫుడు గౌరవాధ్యక్షునిగా కేశినేని ఉన్నారు కాబట్టే. ఈ విషయం తెలిసినప్పటి నుండి ఎంపి మండిపోతున్నారట.
అలాగే విజయవాడ కార్పొరేషన్ను టీడీపీ గెలిస్తే ఎంపి కూతురికే మేయర్ గా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అయితే మారిన పరిస్దితుల్లో ఎంపి కూతురికి కాకుండా మేయర్ పోస్టును విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ భార్య, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనూరాధకు ఇప్పించే ప్రయత్నాలను పార్టీలోని కమ్మ ప్రముఖులే మొదలుపెట్టినట్లు టాక్. దీంతో ఎంపి మరింతగా మండిపోతున్నారు.
పార్టీలోనే కాకుండా బయట కూడా తమ సామాజికవర్గమే తనకు వ్యతిరేకంగా తయారైందనే మంట కేశినేనిలో పెరిగిపోతోంది. ఒకేసారి ఇటు సామాజికవర్గాన్ని అటు పార్టీ నేతలను దూరం చేసుకోవటంలో ఎంపి ఆలోచన ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఎంపి టీడీపీని వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంటా బయటా జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఎంపి ఒంటరైపోతున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది.