రామోజీరావు మరో డిజిటల్ ఐడియా

మీడియా సంస్థ ఏదైనా కానీ.. దానికి ప్రకటనల మీద వచ్చే ఆదాయం చాలా ముఖ్యం. ఇందుకోసం సదరు మీడియా సంస్థలు పడే పాట్లు అన్నిఇన్ని కావు. వ్యాపారం అన్నాక ఆదాయం కోసం ఎంతోకొంత కష్టం తప్పదు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రకటనల ఆదాయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా పుణ్యమా అని.. ప్రింట్ మీడియాకు భారీ దెబ్బ పడింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. డిజిటల్ రంగంలో మీడియాకు వస్తున్న ఆదాయం అంతంతమాత్రమే. దీన్ని మరింత పెంచేందుకు వీలుగా మీడియా మొఘల్ రామోజీ రావు కొత్త ఎత్తు వేసినట్లుగా చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా.. నాలుగు రాష్ట్రాలకు చెందిన కీలకమైన మీడియా సంస్థలు చేతులు కలిపాయి. దీని ద్వారా.. ఎవరైనా యాడ్ ఇవ్వాలంటే.. నాలుగు సంస్థలకు కలిపి ఒకటే యాడ్ మాట్లాడుకోవచ్చు. దీని ద్వారా.. నాలుగు రాష్ట్రాల్లోని వారిని కనెక్టు అయ్యేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం సౌత్ ప్రీమియం పబ్లిషర్స్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

తెలుగుకు సంబంధించి ఈనాడు.. తమిళానికి సంబంధించి దినమలార్.. మలయాళపాఠకులకు సంబంధించి మనోరమా ఆన్ లైన్.. కన్నడిగుల కోసం ప్రజావాణి ఆన్ లైన్ విభాగం ఒకే వేదిక మీదకు వచ్చాయి. దీంతో.. భారీ ఎత్తున ప్రకటన ఆదాయాన్ని సొంతం చేసుకోవాలన్న ఎత్తుగడ వేశాయి. మరీ వ్యూహం ఎంతమేర వర్కువుట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

డిజిటల్ రంగంలో ప్రకటన ఆదాయం భారీగా ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా.. ఎంత చేసినా.. ఆదాయం పెద్దగా రాని పరిస్థితి నెలకొని ఉంది. పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో..నాలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ మీడియా సంస్థలు ఒకటిగా కలిసి యాడ్ ప్యాకేజీని రూపొందించిన ఈ వైనం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. డిజిటల్ మీడియాలో ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవటానికి రామోజీ భారీ ఎత్తుగడే వేశారని చెప్పక తప్పదు.