తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు మారుపేరు అన్న సంగతి తెలిసిందే. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా తప్పులు చేసినా.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా.. ఆయన ఊరుకోరు. ఈ విషయంలో పార్టీ కార్యక్రమాల్లో, మీడియా ముందు కూడా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. హెచ్చరికలూ జారీ చేస్తుంటారు బాబు. ఐతే బాబుతో పోలిస్తే నారా లోకేష్ కొంచెం మెతక అనే అభిప్రాయం ఉంది.
కానీ అవసరమైనపుడు నారా లోకేష్ కొరడా ఝళిపించడానికి వెనుకాడరు. తాజాగా ఆయన పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలు ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దురుసు ప్రవర్తన, ఇతర అవలక్షణాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ స్పందించారు.
తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొందరు నేతలకు మంచి చెడులు తెలియడం లేదని నారా లోకేష్ అన్నారు. అవగాహన రాహిత్యం, అనుభవ లేమి వల్ల వారిలో సమన్వయం ఉండట్లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ నేతలు.. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. సమస్యలను ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై కొత్త ఎమ్మెల్యేలకు అవగాహణ కల్పించాలని ఆయన కోరారు. కొత్త ఎమ్మెల్యేలు మళ్లీ గెలవాలంటే లోటు పాట్లు సరి చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు లోకేష్ అంచనా వేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates