ఏపీ ముఖచిత్రం మారనుందా? అనేక ప్రాంతాల్లో మార్పులు రానున్నాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను చేపట్టింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రుల బృందం పరిశీలిస్తోంది. రెండు కొత్త జిల్లాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల డిమాండ్ మేరకు డివిజన్ల వారీగా కూడా హద్దులను మార్చనున్నారు.
తద్వారా ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయనున్నారు. నిజానికి వైసీపీ హయాంలోనే జిల్లాల విభజన జరిగింది. అయితే దీనిపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. జిల్లాల పేర్ల మాట అలా ఉంచితే, మదనపల్లె, మార్కాపురం, రాజంపేట, నరసాపురం వంటి పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు తమకు దూరంగా ఉన్నాయని ప్రజలు పునరావృతంగా విన్నవించారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంతో కూటమి ప్రభుత్వం తాజాగా దీనిపై అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి తుది విడత చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా దీనిపై నిర్ణయం వెలువడనుంది. దీంతో జిల్లాల రూపురేఖలు దాదాపు మారుతాయన్న చర్చ సాగుతోంది.
ఇక ఇదే సమయంలో తాజాగా సీఎం చంద్రబాబు మూడు మెగా సిటీలను ప్రకటించారు. తిరుపతి, విశాఖ, అమరావతి నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దాలని ఆయన నిర్ణయించారు.
దీంతో ఇక ఏపీ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న అంచనాలు వస్తున్నాయి. అమరావతి మెగా సిటీ విషయంలో గుంటూరు, విజయవాడ సహా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలను కలపనున్నారు. విజయవాడ-మంగళగిరి మధ్య కృష్ణా నదిపై రెండు ఐకానిక్ వంతెనలను ఏర్పాటు చేయనున్నారు.
ఇక తిరుపతి మెగా సిటీ పరిధిని మరింత విస్తరించి సత్యవేడు, నగరి, పూతలపట్టు వరకు తీసుకువెళ్తారు. తద్వారా తిరుపతిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం పెరుగుతుంది.
ఇక విశాఖను మరింత విస్తరించి విజయనగరం దాకా అభివృద్ధి చేయనున్నారు. తద్వారా ఏపీ ముఖచిత్రం మారడంతో పాటు మెగా సిటీల్లో పెట్టుబడుల వరద ప్రవహిస్తుందన్న అంచనాలు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates