ఏపీలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కోటి మందికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
స్వమిత్వ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 613 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 5.18 లక్షల మందికి యాజమాన్య పత్రాలు అందించేందుకు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. రెండో విడత మరో 5,847 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి ఈ నెలాఖరుకి మరో 45.66 లక్షల మందికి వారి యాజమాన్య హక్కు పత్రాలు సిద్ధం చేస్తాం అన్నారు. డిసెంబర్ నుంచి మూడో విడత ప్రారంభించి మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీ సర్వే, గత ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన పాసు పుస్తకాల కారణంగా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. మన ప్రభుత్వంలో అలాంటి తప్పులకు తావుండదు. రీ సర్వే తర్వాత ఎవరి భూములు వారికి అప్పగిస్తూ ప్రాపర్టీ కార్డులు ఇస్తాం. రాజ ముద్రతో కూడిన కార్డులు అందిస్తాం. ఈ ప్రాపర్టీ కార్డులు వచ్చిన తర్వాత ఆయా స్థలాలు అమ్ముకునేందుకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates