లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!

లండ‌న్ పర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం.. కీల‌క భేటీ నిర్వ‌హించారు. లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న‌ర్ (ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారి)తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంట‌ల‌కుపైగా సాగిన ఈ బేటీలో ప‌లు కీల‌క విష‌యాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించారు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా విక్ర‌మ్ దొరైస్వామి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌ను త‌ను విడిది చేస్తున్న హోట‌ల్‌కు పిలిపించుకున్న సీఎం చంద్ర‌బాబు.. అనేక విష‌యాల‌పై చ‌ర్చించారు.

ప్ర‌ధానంగా ఏపీలోని యూనివ‌ర్సిటీల‌లో లండ‌న్ త‌ర‌హా విద్యా బోధ‌న అంశాల‌కు సంబంధించిన సూచ‌న‌లు చేయాల‌ని కోరారు. అదేవిధంగా బ్రిట‌న్‌లోని ప్ర‌ఖ్యాల విశ్వ‌విద్యాల‌తో ఏపీలోని ఆంధ్ర‌, శ్రీవేంక‌టేశ్వ‌ర‌, నాగార్జున విశ్వ‌విద్యాల‌యాల‌ను అనుసంధానం చేయ‌డం ద్వారా విదేశీ విద్యార్థుల‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేయ‌డంపైనా దొరైస్వామితో చంద్ర‌బాబు చ‌ర్చించారు. మ‌రీ ముఖ్యం గా ఏపీ విశ్వ‌విద్యాల‌యాల‌లో మ‌రింత‌ నాణ్య‌మైన విద్య‌ను చేరువ చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం.. అదేవిధంగా అమ‌లుపైనా చ‌ర్చించారు.

కేంద్ర ప్ర‌భుత్వం-బ్రిట‌న్ భాగ‌స్వామ్యంతో ఏపీలో ఏర్పాటు చేయ త‌ల‌పెట్టిన జాయింట్ వెంచ‌ర్ల‌పైనా ఇరువురు చ‌ర్చించారు. ఏపీలో ఉన్న అవ‌కాశాలు, యువ శ‌క్తి, ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న అవ‌కాశాల‌ను సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిలో క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటు, విశాఖ‌లో గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు వంటి విష‌యాల‌ను చ‌ర్చించారు. త‌ద్వారా ప్ర‌పంచ స్థాయి యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనేక ప్రోత్సాహ‌కాలు ఇస్తోంద‌న్నారు. బిటన్ విశ్వ‌విద్యాల‌యాల‌తో ప‌రిశోధ‌న‌, ఇన్నోవేష‌న్ రంగాల్లో ఏపీ విశ్వ‌విద్యాల‌యాలు క‌లిసి ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.

మొత్తంగా.. భార‌త హైక‌మిష‌న‌ర్‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఇటీవ‌ల కుదుర్చుకున్న ఒప్పందాలు.. వాటి సానుకూలత‌, స‌హా బ్రిట‌న్ నుంచివ‌చ్చే వ్యాపారులు, పెట్టుబ‌డిదారుల‌కు స‌రైన వివ‌రాలు అందించేలా సాయం చేయాల‌ని దొరైస్వామిని సీఎం చంద్ర‌బాబు కోరారు. ఏపీలో ఉన్న అపార అవ‌కాశాల‌ను కూడా ఆయ‌న‌కు వివ‌రించారు. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు త‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అందుకునే రెండు అవార్డుల ఫంక్ష‌న్‌ల‌లోనూ పాల్గొంటారు. అనంత‌రం.. సీఐఐ నిర్వ‌హించే రోడ్ షోలోనూ పాల్గొంటారు.