మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ గత నెల 31న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బెర్త్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
అప్పట్లో అజారుద్దీన్‌కు హోం శాఖ కట్టబోతున్నారనే ప్రచారం బలంగా సాగింది. ప్రస్తుతం హోం శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటం, జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు తాజాగా అజారుద్దీన్‌కు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను అప్పగించారు. మైనారిటీ సంక్షేమ శాఖ పాతదే అయినా, కొత్తగా పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ అనే శాఖను సృష్టించడం గమనార్హం. గత కేసీఆర్ మంత్రివర్గంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ శాఖ లేదు. కాబట్టి ఇది అజారుద్దీన్ కోసం ప్రత్యేకంగా సృష్టించారని అంటున్నారు.
ఇప్పుడు శాఖల కేటాయింపు పూర్తవడంతో అజారుద్దీన్ పని ప్రారంభించనున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంది. కానీ, ఇక్కడ కొన్ని కీలకమైన సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. ముఖ్యంగా మక్కాకు వెళ్లే వారికి ప్రభుత్వ సాయం పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. అలాగే రుణాల కోసం ఎదురుచూస్తున్న మైనారిటీ యువతకు సాయం చేయడం కూడా ప్రాధాన్యంగా ఉంది.
పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ కొత్తదైనందున, దీని ద్వారా యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏదేమైనా, ప్రచారం జరిగినట్లుగా హోం శాఖ దక్కకపోయినా, అజారుద్దీన్‌కు ఇచ్చిన కొత్త బాధ్యతలు గమనించదగ్గవే.
Gulte Telugu Telugu Political and Movie News Updates