తరాలు మారాయి…రాజకీయాలు మారాయి…ఎన్నికల తీరు మారింది…ఎన్నికలలో నేతల ప్రలోభాలు..ఓటర్ల లాభాల లెక్కలూ మారాయి…అదే విధంగా ఎన్నికల ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తున్న రాజకీయ నాయకులు…ప్రత్యర్థులపై విమర్శలు సంధించేందుకు వినూత్న ప్రచారానికి తెర తీస్తున్నారు. ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వినూత్న ప్రయోగం వైరల్ గా మారింది. మాజీ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్…టెక్నాలజీతో ఈ ఎన్నికల ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు.
తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన హైడ్రా వ్యవహారాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా కేటీఆర్ మలుచుకున్నారు. అంతేకాదు, హైడ్రా ద్వారా నష్టపోయిన ప్రజలవాణిని స్వయంగా వినిపిస్తూ జూబ్లీహిల్స్ ఓటర్లను కేటీఆర్ ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో, రోడ్ షోలల్ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ హైడ్రా బాధితుల గోడును జనానికి వినిపిస్తున్నారు. తమ ఇళ్లు కూల్చడంతో నిలువ నీడ లేకుండా నడిరోడ్డు మీదకు వచ్చామని హైడ్రా బాధిత మహిళలు కన్నీటి పర్యంతమవుతున్న వీడియోలను ప్లే చేస్తున్నారు.
ఈ ఎన్నికల ప్రచారంలో దాదాపుగా తన ప్రతి ప్రసంగంలో హైడ్రా ప్రస్తావన తెస్తున్నారు కేటీఆర్. హైడ్రా పేరుతో హైదరాబాద్ లో వేలాది మంది ఇళ్లు కూల్చారని, హైడ్రా రాకాసి బోరబండ గల్లీలోకి రాకూడదంటే కారు గుర్తుకు ఓటేయాలని ఆయన కోరుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గరీబోళ్ల ఇళ్లు కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకపాలనను ప్రజలు గుర్తించారని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. అయితే, హైడ్రా కూల్చివేతల అంశం బీఆర్ఎస్ కు కలిసి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates