నియోజకవర్గాల్లో బలం లేకపోతే.. పార్టీలైనా.. నాయకులైనా విజయం దక్కించుకుంటారని అనుకోలేం. సో.. నాయకులు ఎంత బలమైన వారైనా.. పార్టీల పరంగా.. వ్యక్తుల పరంగా నియోజకవర్గంలో పట్టు పెంచకపోతే.. అది ఇబ్బందే అవుతుంది. ఇక, ఉన్న పట్టును నిలుపుకోవడం కూడా.. నాయకులకు అత్యంత ముఖ్యం. ఎందుకంటే ప్రత్యర్థులను అంచనా వేయడం అంత ఈజీ కాదు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో పరిణామాలు మారాయి.
ఇవి వాస్తవం. వైసీపీ ఒప్పుకొన్నా.. ఒప్పుకోకున్నా కూడా.. కోవూరులో సైలెంట్‌గా దూసుకుపోతున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి. “అమ్మ” పేరుతో ఇక్కడ జరుగుతున్న ప్రచారం.. పనులు కూడా వైసీపీకి సెగ పుట్టిస్తున్నాయి. ఎందుకంటే..అమ్మ సెంటిమెంటు కనుక బలపడితే.. మహిళా ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున కదిలిపోతుంది. కానీ.. దీనికి అడ్డుకట్ట వేయలేక.. పోటాపోటీ రాజకీయాలు చేయలేక.. వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక, ప్రశాంతమ్మ.. క్షేత్రస్థాయి పర్యటనలు కూడా పుంజుకుంటున్నాయి.
వేమిరెడ్డి ట్రస్టు ద్వారా నిరంతరం ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే ప్రశాంతి అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడ నుంచి ఎవరు వచ్చినా.. సమస్యలు వింటున్నారు. వారిని ఆప్యాయంగా పలక రిస్తున్నా రు. ఈ పరిణామాలతో ప్రశాంతి పేరు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది. మరోవైపు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై సానుభూతి తగ్గుతున్న విషయం తెలిసిందే. ప్రశాంతి రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. సొంత ఇమేజ్‌ను దెబ్బతీశాయి.
అంతేకాదు.. నల్లపరెడ్డి బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇది వైసీపీకి మైనస్‌గా మారింది పోనీ.. నల్లపరెడ్డి అనుకూల వాదులు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నరా? అంటే.. అది కూడా లేదు. ఎందుకంటే.. రాజకీయంగా చేసినా.. వ్యక్తిగతంగా చేసినా.. నల్లపరెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఇప్పటికీ.. టీడీపీ నాయకులు ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు. తరచుగా మాజీ మంత్రి సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఫలితంగా.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి..వైసీపీ ఈ నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates