రెండు తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకమైన కృష్ణానది గురించి.. ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్రసంగాలు దంచి కొడుతుంటారు. అంతేకాదు.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. నాగార్జున సాగర్ నీటి విషయంలో లడాయి పడుతున్న విషయం కూడా తెలిసిందే. దీనికి కృష్ణానదే ఆధారం అన్నదీ తెలిసిందే. అయితే.. అసలు నాగార్జున సాగర్‌వరకు కృష్ణమ్మ రావాలంటే.. పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వం ఈ కృష్నానదిని స్వేచ్ఛగా వదిలి పెట్టాలి. తమ హక్కులుగా సంక్రమించిన..నీటిని వాడుకుంటే అభ్యంతరం లేదు. కానీ.. దీనికి మించి అన్నట్టుగా కృష్ణమ్మ ముక్కు మూసే ప్రయత్నం చేస్తోంది.
కర్ణాటక సర్కారు తలచిందే జరిగితే.. పట్టుదలతో ముందుకు సాగితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కృష్ణమ్మ కరువవుతుంద ని నీటి పారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటు తెలంగాణ,అటు ఏపీలోనూ నీటి పారుదల రంగ నిపుణులు ఆదివా రం వివిధ ప్రాంతాల్లో వరుస సమావేశాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నా యన్న విషయంపై చర్చించారు. కానీ, సమాధానం లభించలేదు. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు ఏపీ, తెలంగాణ సర్కార్లు ప్రయత్నమూ చేయడం లేదు. ఇంకోవైపు.. కర్ణాటక మాత్రం దూకుడుగా ముందుకు సాగుతోంది.
కర్ణాటక దూకుడు ఇలా..
గత నెలలోనే కేబినెట్ సమావేశంలో ఆల్మట్టి ఎత్తును పెంచాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనం చేసేందుకు అధికారులు, మంత్రులతో కూడిన కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ తన అధ్యయన నివేదికను శుక్రవారం ఇచ్చింది. దీని ప్రకారం ఎత్తును పెంచేందుకు 5 విడతలు.. 70 కోట్ల రూపాయలను విడుదల చేయాలని సూచించింది. దీంతో తొలి విడతగా కర్ణాటక ప్రభుత్వం 70 కోట్ల రూపాయలను విడుదల కూడా చేసింది. అంటే.. ఇక, టెండర్లు పిలవడం.. పనులు అప్పగించడం అనే ప్రక్రియే మిగిలి ఉంది. ఇంత జరుగుతున్నా.. రెండు తెలుగు రాష్ట్రాలూ స్పందించడం లేదు.
కేంద్రానికి లేఖ రాసి..
ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రయత్నిస్తున్నా.. తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలు ఎవరూ పెదవి విప్పడం లేదన్న విమర్శ ఉంది. పైగా.. కేంద్రంలోని జలశక్తి మంత్రిత్వ శాఖకు రాష్ట్రం లేఖరాసి చేతులు దులుపుకొంది. దీని వల్ల ఒరిగేది ఏమీ లేదని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఇక, ఏపీ ప్రభుత్వం బనకచర్లపై దృష్టి పెట్టిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కర్ణాటక ప్రభుత్వం తాంబూలాలిచ్చేస్తోంది.. మరి రెండు తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates