ఉద్యమాల్లో ఉన్నవారు.. రాజకీయాల్లోకి రావడం అరుదేనని చెప్పాలి. గతంలో లోకాయుక్త కోసం ఉద్యమించిన అన్నాహజారే.. సారా రహిత రాష్ట్రం కోసం ఉద్యమించిన దూబగుంట పార్వతమ్మ (నెల్లూరు).. ఇలా చాలా మంది రాజకీయాల్లోకి రావాలని ఆఫర్లు వచ్చినా.. రాలేదు. ఎందుకంటే.. ఉద్యమం వేరు. రాజకీయాలు వేరు. అంతెందుకు.. దేశ స్వాతంత్య్రం కోసం పనిచేసిన మహాత్ముడు కూడా.. రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకంటే.. ఉద్యమంలో ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ.. రాజకీయాల్లోకి వచ్చాక సహజంగానే ఉండదు.
అనేక నియమాలు, రాజకీయంగా ఉండే ఒత్తిడులు, సామాజిక వర్గాల సమన్వయం, ఓటు బ్యాంకు, పార్టీ లైన్లు.. ఇలా అనేక అంశాలు నాయకులకు పరిధులు విధిస్తాయి. అందుకే.. ఉద్యమాల్లో నుంచి వచ్చి.. రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు కూడా పెద్దగా మనకు కనిపించరు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయినా.. ఆయన దానిని నిలబెట్టుకోలేకపోయారు. ఇక, లోక్స్‌త్తా ఉద్యమంతో రాజకీయ బాట పట్టిన జయప్రకాశ్ నారాయణ్ (మాజీ ఐఎఎస్) కూడా.. తన సత్తా చాటలేకపోయారు.
ఒకసారి విజయంతోనే జేపీ సరిపెట్టుకున్నారు. దీనికి ప్రధాన కారణం.. రాజకీయాలకు, ఉద్యమాలకు ఉన్న విభిన్నమైన తేడానే! ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు, చర్చకు వచ్చిందంటే.. అమరావతి ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కొలికపూడి శ్రీనివాస్.. గత ఎన్నికలకు ముందు రాజకీయ బాట పట్టారు. అమరావతి ఉద్యమంలో ఉన్న వారిలో ఈయన ఒక్కరికే రాజకీయంగా అవకాశం కూడా లభించింది. కానీ, ఆయన ఉద్యమానికి.. రాజకీయాలకు మధ్య తేడాను గుర్తించలేక.. తడబడ్డారని వాదనలు వినిపిస్తున్నాయి.
ఉద్యమంలో ఉన్నప్పుడు ఒకటే సిద్ధాంతం ఉంటుంది. ఒకటే లైన్ కూడా ఉంటుంది. దాని సాకారమే పరమావధిగా నాయకులు ముందుకు సాగుతారు. కానీ, పైన చెప్పుకున్నట్టుగా రాజకీయాల్లో ఒకే పంథా ఉండదు. సమయానికి తగిన విధంగా నాయకులు మార్పు చెందాలి. ఒక్కోసారి విమర్శలు కూడా వస్తాయి. మరికొన్ని సార్లు అవమానాలు కూడా ఎదురవుతాయి. వీటిని తట్టుకుని నిలబడటం అనేది రాజకీయాల్లో కీలక అంశం. చంద్రబాబే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయనను జైలులో పెట్టినా.. కుటుంబాన్ని విమర్శించినా.. తట్టుకుని నిలబడ్డారు. ఈ తేడా గమనిస్తే.. ఉద్యమ కారులు సక్సెస్ అవుతారు. లేకపోతే.. ఇదే మొదలు.. ఇదే చివర అవుతుందని గుర్తించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates