దేశంలో ఏపీకే ఆ ఘ‌న‌త ద‌క్కింది.. : చంద్ర‌బాబు

దేశంలో ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ఘ‌న‌త ఏపీకి మాత్ర‌మే ద‌క్కింద‌ని, ఇది తెలుగు నేల చేసుకున్న అదృష్ట‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అది క్వాంట‌మ్ వ్యాలీ అని చెప్పారు. దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఈ వ్యాలీకోసం ప్ర‌య‌త్నించాయ‌ని.. కానీ, కేంద్రం స‌హ‌కారంతో దీనిని అమ‌రావ‌తికి తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలోనే దీనిని ప్రారంభిస్తున్న‌మాన్నారు. ఇది దేశంలోని క్వాంట‌మ్ కంప్యూటింగ్ వ్య‌వ‌స్థ‌కు కీల‌క చోద‌క శ‌క్తిగా మారుతుంద‌న్న ఆయ‌న‌.. భారీ ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌ని చెప్పారు. ఏపీకి గేమ్ చేంజ‌ర్‌గా కూడా మారుతుంద‌ని అన్నారు.

దుబాయ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం చంద్ర‌బాబు.. శుక్ర‌వారం రాత్రి స్థానిక ఓ హోట‌ల్‌లో నిర్వ‌హించిన `తెలుగు డ‌యాస్పోరా` స‌మావేశంలో గ‌ల్ప్ దేశాలైన అబుదాబీ, ఖ‌తార్‌, కువైట్‌, ఒమ‌న్ త‌దిత‌ర దేశాల నుంచి భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చిన తెలుగు వారిని ఉద్దేశించి సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. సీఎం చంద్ర‌బాబు.. 2014-2024 వ‌ర‌కు మొత్తం ప‌దేళ్ల‌లో ఏపీలో జ‌రిగిన అన్ని ప‌రిణామాల‌ను వారికి వివ‌రించారు. ముఖ్యంగా త‌న‌ను వైసీపీ హ‌యాంలో జైల్లో పెట్టిన‌ప్పుడు.. తెలుగు వారు దేశాల‌కు అతీతంగా.. ప్రాంతాల‌కు అతీతంగా ఏకమైన తీరును ప్ర‌స్తావించి.. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇదేస‌మ‌యంలో 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎక్క‌డెక్క‌డ నుంచో ప్ర‌జ‌లు ఏపీకి బారులు తీరి.. NDA కూట‌మి విజ‌యానికి ఎంతో కృషి చేశార‌ని తెలిపారు. వారంద‌రికీ కూడా పేరు పేరునా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాన‌ని అన్నారు. ఇది రాష్ట్రాన్ని స‌రైన మార్గంలో న‌డిపించేందుకు తెలుగు వారు ఏకమై చేసిన అతి గొప్ప ఉద్య‌మంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. 2014-19 మ‌ధ్య అనేక పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చామ‌న్న ఆయ‌న‌.. టీడీపీ అధికారంలో గ‌త ఐదేళ్లు కూడా కొన‌సాగి ఉంటే.. ఏపీ రూపు రేఖ‌లు వేరేగా ఉండేవ‌ని తెలిపారు. అందుకే మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని తెలుగు వారికి సూచిస్తున్నాన‌ని చెప్పారు. దీనిని ప్ర‌తి ఒక్క‌రూ అర్ధం చేసుకోవాల‌ని తెలిపారు.

మారుతున్న కాలాన్ని బ‌ట్టి..

మారుతున్న కాలాన్ని బ‌ట్టి.. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మార్పులు వ‌స్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఒక‌ప్పు డు చ‌రుము విక్ర‌యాల‌పైనే ఆధార‌ప‌డిన గ‌ల్ఫ్ దేశాల్లో మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని.. ప‌ర్యాట‌కంపై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నార‌ని సీఎం తెలిపారు. అదేవిధంగా ఏపీలోనూ ప‌ర్యాట‌కం.. లాజిస్టిక్స్ రంగాల్లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్టు చెప్పారు. ఏపీ టూరిజం, నాలెడ్జి ఎకానమీ దిశగా అడుగులు వేస్తోంద‌న్నారు. గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకువస్తే.. ఇప్పుడు విశాఖకు గూగుల్ తీసుకువస్తున్నామని చెప్పారు. సాంకేతికత‌ను ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ భాగ‌స్వామ్యం చేస్తున్న‌ట్టు చెప్పారు.