ఏపీ సీఎం చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ.. కొన్ని విషయాలను ప్రస్తావించిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్.. అవి తనకు మాత్రం వర్తించవని అనుకున్నారో ఏమో.. అనే సందేహం వస్తోంది. ఎందుకంటే.. హైటెక్ సిటీని తానే డెవలప్ చేసినట్టు చంద్రబాబు బిల్డప్ రాజకీయాలు చేశారని.. చేస్తున్నా రని జగన్ వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ.. హైటెక్ సిటీకి పునాదులు వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని.. తర్వాత.. వైఎస్ రాజశేఖరరెడ్డి దానిని కొనసాగించారని చెప్పారు.
అందుకే.. హైటెక్ సిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. కానీ.. వాస్తవం ఏంటంటే.. జనార్దన్ రెడ్డి తర్వాత.. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ. సో.. ఆ 9 సంవత్సరా ల్లోనే హైటెక్ సిటీకి పూర్తిస్థాయిలో రూపం కల్పించారు. ఇక, చంద్రబాబే స్వయంగా చెప్పినట్టు.. తను ప్రారంభించిన పనులను వైఎస్ రాజశేఖరరెడ్డి ఎక్కడా భగ్నం చేయలేదు. కాబట్టే.. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది. పెద్ద ఎత్తున పీవీ ఎక్స్ ప్రెస్ వే కూడా వచ్చింది.
ఇక, తెలంగాణ ఏర్పాటు తర్వాత… కేసీఆర్ కూడా అభివృద్ధి చేశారని అన్నారు. ఆయా విషయాలను ప్రస్తావించిన జగన్.. చంద్రబాబు వారి పేర్లు ఎక్కడా చెప్పరని అన్నారు. పోనీ.. చెప్పక పోయినా.. మొత్తం క్రెడిట్‌ను తన ఖాతాలోనే వేసుకున్నా.. నష్టం అయితే ప్రజలకు రాలేదు. పేర్లుఊర్లు.. అనేవి ఉన్నా.. లేకున్నా.. ఆ ఫలాలు ప్రజలకు దక్కుతున్నాయి. కానీ.. ఏపీలో మీరు చేసింది ఏంటి? అనేది జగన్ చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. వైఎస్, కేసీఆర్ మాదిరిగా మీరు ఏపీలో వ్యవహరించారా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. ఏపీలో గత 2014-19 మధ్య చంద్రబాబు కట్టించిన ప్రజా వేదిక(8 కోట్ల విలువ)ను వచ్చీ రావ డంతోనే కూల్చేశారు. అమరావతి రాజధానిని పక్కన పెట్టి మూడు రాజధానులు అంటూ భుజాన ఎత్తుకు న్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తీసేశారు. సో.. వైఎస్, కేసీఆర్‌లతో పోల్చుకుంటే.. మీరు ఏమేరకు చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించారు? అనేది సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలు. అన్నింటినీ ధ్వంసం చేసి.. చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందోనన్న దుగ్ధతోనే ఇలా చేశారని అనుకోవాలా!? అనేది నెటిజన్ల ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates