ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి ప్రాంతంలో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తునిలోని ఒక తోటలో ఒక మైనర్ స్కూల్ బాలిక మీద అత్యాచారం చేయబోతుండగా.. నారాయణరావు అనే వృద్ధుడిని ఓ వ్యక్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వీడియో తీయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
వైసీపీ ఈ వీడియోను సోషల్ మీడియాలో మరింతగా వైరల్ చేసి ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ వ్యవహారం సంచలనం రేపడంతో రాత్రికల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. నారాయణరావును అరెస్ట్ చేశారు. ఐతే ఒక రాత్రి గడిచేసరికి నారాయణరావు విగతజీవిగా మారడం మరింత సంచలనానికి దారి తీసింది. ఈ రోజు కోమటి అనే చెరువు నుంచి నారాయణరావు మృతదేహాన్ని వెలికి తీశారు.
నారాయణరావు సదరు బాలిక మీద ఇలా అత్యాచారయత్నం చేయడం తొలిసారి కాదని వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయిని బెదిరించి పలుమార్లు అదే తోటకు తీసుకొచ్చి లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. ఐతే ఈసారి ఎవరో వీడియో తీసి అతడి బండారాన్ని బయటపెట్టారు. ఇదేం పని అని నిలదీస్తే.. నేనెవరో తెలుసా.. మున్సిపల్ కౌన్సిలర్‌ని.. ఆ అమ్మాయి బాత్రూంకి వెళ్లాలంటే తీసుకొచ్చా అంటూ దబాయించాడు నారాయణరావు. ఈ వీడియో వైరల్ అయి ప్రభుత్వం అప్రమత్తం కావడంతో పోలీసులు ఆలస్యం చేయకుండా నారాయణరావును అరెస్ట్ చేశారు. ఐతే రాత్రి పదిన్నర ప్రాంతంలో అతణ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా.. దారి మధ్యలో తాను బాత్రూం వెళ్లాలని చెప్పడంతో నారాయణరావును విడిచిపెట్టారు. ఐతే అతను నేరుగా వెళ్లి చెరువులో దూకేశాడు.
తెల్లవారుజామున గజ ఈతగాళ్లను పెట్టించి వెతికించగా.. ఉదయానికి నారాయణరావు మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసుల సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు నారాయణరావు మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ గొడవ చేశారు. రాత్రి చెరువులో దూకితే ఉదయం కానీ పోలీసులు విషయం చెప్పలేదని.. ఇది ఆత్మహత్య కాదని.. పోలీసులే చంపేశారని ఆరోపించారు. అనంతరం పోలీసులు నారాయణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates