తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెక్ పోస్టులను (జాతీయ రహదారులపై కాదు) రద్దు చేస్తూ.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయం వెనుక రాష్ట్ర ప్రభుత్వంతోపాటు.. కేంద్ర ప్రభుత్వం కూడా ఉండడం గమనార్హం. ఎందుకంటే.. దాదాపు దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ప్రభుత్వం స్థానికంగా రహదారులు నిర్మించలేదు. ఈ వ్యవహారం ఒకప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీనికి తాజాగా కారణం బయటకు వచ్చింది.
రాష్ట్రాలకు కేంద్రం రహదారుల నిర్మాణం కింద ఇన్సెంటివ్‌లు ఇస్తుంది. రాష్ట్ర స్థాయి రహదారులకు ఇది వర్తిస్తుంది. అయితే.. గత ఐదేళ్లలో కరోనా పేరుతో ఈ సొమ్మును కేంద్రం ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. రహదారులను నిర్మించలేదు. ఈ వ్యవహారం.. ఆయా రాష్ట్రాల ఎన్నికల సమయంలో చర్చకు వచ్చింది. ఇదేసమయంలో అప్పటికే నిర్మించిన రహదారుల చెక్ పోస్టులకు కాలం తీరింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని..కేంద్ర ప్రభుత్వం ఏడాది కిందట… రాష్ట్రాల్లోని చెక్ పోస్టులను ఎత్తేయాలని.. కొత్తగా రహదారులు నిర్మించనప్పుడు.. వాటిని కొనసాగించవద్దని తేల్చి చెప్పింది.
ఇక, తెలంగాణకు వస్తే.. ఇక్కడ కూడా కేంద్రం ఇచ్చిన జీవోను అమలు చేయాల్సి ఉంది. అయితే.. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు ఏడాది పాటు వీటిని కొనసాగింది. ఇటీవల రెండు మాసాల కిందట కేంద్రం నుంచి తీవ్ర వత్తిడి వచ్చింది. దీంతో నెల కిందట జీవో ఇచ్చింది. రహదారులపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తేయాలని తేల్చి చెప్పింది. ఇదిలావుంటే.. రవాణాశాఖకు చెక్ పోస్టులు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. మరీ ముఖ్యంగా అడ్డదారిలో సొమ్ములు చేసుకునే కొందరు అధికారులకు ఇవి మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
ఈ క్రమంలో సర్కారుపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ పరిణామాలను గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా వాటిని నిలుపుదల చేయాలంటూ.. గెజిట్ జారీ చేసింది. దీంతో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులను నిలిపివేశారు. ఇక, కేంద్రం నుంచివచ్చే ఆదేశాలను బట్టి.. కొత్తగా రహదారుల నిర్మాణం చేపడితే.. ఆతర్వాత కాంట్రాక్టు సంస్థలకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అప్పటి వరకు వాహనదారులకు హ్యాపీనే!.
Gulte Telugu Telugu Political and Movie News Updates