ద‌టీజ్ అమ‌రావ‌తి: కేంద్రం త‌లుచుకుంది.. బ్యాంకులు బారులు!

కేంద్రం త‌లుచుకుంటే.. అనుమ‌తుల‌కు కొద‌వా?  ప‌నులకు కొర‌తా?  ఇప్పుడు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి లోనూ ఇదే జ‌రుగుతోంది. గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల పేరుతో మూడు ముక్క‌లాట ఆడిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌టి అవ‌స‌రాల నేప‌థ్యంలో కేంద్రం మౌనంగా ఉంది. కానీ.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌డంతో  కేంద్రం నుంచి కూడా అంతే స‌హ‌కారం ల‌భిస్తోంది.

ఫ‌లితంగా నిధులు రావ‌డంతోపాటు.. ప‌నులు కూడా శ‌ర వేగంగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా ఇటీవ‌ల కొన్ని బ్యాంకులు.. అమ‌రావ‌తిలో ప్ర‌ధాన కేంద్రాల‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. కొన్ని కొన్ని జాతీయ బ్యాంకులు మాత్రం వెనుక‌డుగు వేశాయి. ఎందుకంటే .. జాతీయ బ్యాంకుల‌కు ఆర్బీఐ స‌హా.. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తులు రావాల్సిన అవ‌స‌రం ఉంది . ఈ వ్య‌వ‌హారంపై ఇటీవ‌ల విశాఖ‌కు వ‌చ్చిన నిర్మ‌లా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు చ‌ర్చించారు.

ఆ వెంట‌నే ఆమె బ్యాంక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించి.. అనుమతులు ఇప్పించారు. ఆర్బీఐతోపాటు.. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఎస్‌బీఐ, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ త‌దిత‌ర బ్యాంకులు.. అమ‌రావతిలో రాష్ట్ర స్థాయి ఆఫీసుల‌ను నిర్మించుకునేందుకు ముందుకు వ‌చ్చాయి. దీనికి ఇక‌, ఇబ్బందులు తొలిగి పోవ‌డంతో ఆయా బ్యాంకులు ముహూర్తాలు కూడా పెట్టుకున్నాయి. అనంత‌రం.. నిర్మాణాల‌ను సొంత‌గా చేప‌ట్టి.. సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేయ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అమరావతికి  రానున్నారు. ఎస్బీఐ స‌హా ప‌లు జాతీయ బ్యాంకుల ప్ర‌ధాన కార్యాల‌యాల‌కు ఆ రోజు ఆమె భూమి పూజ చేసి.. శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు కూడా హాజ‌రు కానున్నారు. నిర్మలాసీతారామన్‌ చేతుల మీదుగా ప్రధాన బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఏర్పాట్ల‌ను ఘ‌నంగా చేయాల‌ని.. ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు కూడా పాల్గొన‌నున్నారు.