ఏపీలోని కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు తరచుగా ప్రజల మధ్యకు కూడా వస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. నెలనెలా.. 1వ తేదీన ప్రజల మధ్యకురావడంతోపాటు.. వారి సమస్యలపై ఆయన దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో తరచుగా ఆయన వినిపిస్తున్న మాట.. తమకు సొంత ఇల్లు లేదనే!. ఇదే విషయంపై పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లోనూ ప్రజలు విన్నవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దిగువ మధ్యతరగతి, పేదల కోసం.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఇల్లు లేని వారి కోసం.. ప్రభుత్వం చక్కని అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సొంత ఇళ్లు లేని మధ్యతరగతి, పేద కుటుంబాలకు కేంద్రం సహకారంతో సొంత ఇల్లు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ, పట్టణ పథకాల కింద.. రాష్ట్రంలోని పేదలు, దిగువ మధ్యతరగతి వారికి సొంత గూడు ఏర్పాటు చేసి ఇవ్వనుంది.
రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలను గుర్తించేందుకు కేంద్ర గృహనిర్మాణశాఖ చేపట్టిన ఈ సర్వే గడువు దేశవ్యాప్తంగా రెండు నెలల క్రితమే ముగిసింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల మందికిపైగా పేదలు ఇళ్లు లేకుండా ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల నివేదించారు. దీనిపై స్పందించిన సీఎం..వెంటనే కేంద్రానికి లేఖ రాశారు. దీంతో తాజాగా కేంద్రం స్పందించింది. ఏపీ చేపట్టిన సర్వేకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది.
కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని వారికి నవంబర్ 5 వరకు గడువిచ్చింది. అర్హులెవరైనా ఉంటే గృహనిర్మాణశాఖ ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆదాయపన్ను చెల్లించని దిగువ మధ్యతరగతి వారు కూడా అర్హులే. వారికి ఎక్కడా సొంత ఇల్లు ఉండకూడదు. ఇప్పటి వరకు రుణం కూడా తీసుకుని ఉండ కూడదు. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన ఇళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవేవీ మీకు వర్తించకపోతే.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates