సీఎం రేవంత్‌కు ఆగ్ర‌హం వచ్చిన వేళ‌.. ఏం జ‌రిగింది?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్థిమితంగా ఉంటారు. ఎప్పుడూ ఆలోచ‌నాత్మ‌కంగా నిర్ణ‌యాలు తీసుకుంటారు. ప్ర‌తిప‌క్షాల‌పై మాత్ర‌మే ఆయ‌న స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. అలాంటిది ఆయ‌న తొలిసారి ఉద్యోగులు, ఉన్న‌తాధికారులు, శాఖ‌ల అధిపతుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామంతో ఉన్న‌తాధికారుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు కూడా ఉలిక్కిప‌డ్డారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే.. తాను చెప్పిన ప‌నుల‌ను కూడా అధికారులు చేయ‌క‌పోవ‌డ‌మే. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ..నిజం. ఈ విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డే స్వ‌యంగా చెప్పారు.

“నేను చెప్పిన త‌ర్వాత కూడా మీరు చేయ‌క‌పోతే ఏం చేయాలి?“ అంటూ శాఖాధిప‌తుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. చెప్పిన ప‌ని చేసేందుకే ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటుంద‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లాల్లో ప‌ర్య‌టించ‌డం లేద‌ని, గ‌త నెల‌లోనే నిర్దేశించుకున్న ప‌ల్లె నిద్ర‌లో కేవ‌లం ఒక‌రిద్ద‌రు క‌లెక్ట‌ర్లు మాత్ర‌మే ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. ములుగు జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభినందించారు. క్షేత్ర‌స్థాయిలో గురుకుల పాఠ‌శాల‌ను ఆయ‌న త‌నిఖీ చేయ‌డం, అక్క‌డే ప‌ల్లె నిద్ర‌కు ఉప‌క్ర‌మించి.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేలా అధికారుల‌తో చ‌ర్చించిన విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఎన్ని సార్లు చెప్పినా విన‌ని అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. ప్ర‌తి ప‌నినీ రికార్డు చేయాల‌ని.. త‌డ‌బాట్లు ప‌నికిరావ‌ని అన్నారు. ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేస్తోంద‌ని.. కానీ, వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లడంలో అధికారులు నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వం అనేక వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని చేస్తున్న‌ప‌నుల‌ను కూడా అధికారులు ప‌ట్టించుకోక‌పోతే.. ఇక‌, తానే తిర‌గాల్సి వ‌స్తుందని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, రికార్డుల న‌మోదు కూడా అధికారుల బాధ్య‌తేన‌ని తెలిపారు. ప్ర‌తినెలా చివ‌రి వారంలో త‌న‌కు నివేదిక‌లు పంపాల‌ని సూచించారు.

శాఖ‌ల ప‌నితీరు చాలా అధ్వానంగా ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయా శాఖ‌ల్లో అనుకున్న విధంగా ప‌నులు చేయ‌డం లేద‌న్నారు. దీనివల్ల క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంద‌న్నారు. తాను చేయించుకున్న స‌ర్వేల్లో ప‌లు లోపాలు క‌నిపించాయ‌ని.. దీనికి అధికారులే బాధ్యుల‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా.. అధికారులు ఏం చేస్తున్నారు?  శాఖ‌ల్లో ఏం జ‌రుగుతోంద‌న్న విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని నివేదిక‌లు ఇవ్వాల‌ని సూచించారు. కాగా.. సీఎం సీరియ‌స్‌కావ‌డం వెనుక‌.. మంత్రి కొండా సురేఖ‌, పొన్న ప్ర‌భాక‌ర్‌, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ల వ్య‌వ‌హారమే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

కొస‌మెరుపు:  ఉద్యోగులు త‌మ త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అలాంటి వారిని తీవ్రంగా హెచ్చ‌రిస్తున్నాన‌ని సీఎం రేవంత్ అన్నారు. త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోకుండా.. వారిని అనాథాశ్ర‌మాల్లో చేర్చేవారి జీతాల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ట్ చేసి.. ఆయా త‌ల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తుంద‌న్నారు. ఈ విష‌యాన్ని అంద‌రూ గుర్తు పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. ఇటీవ‌ల మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ కు చెందిన ఓ ఉన్న‌తాధికారి త‌న త‌ల్లిదండ్రుల‌ను అనాథాశ్ర‌మంలో చేర్చిన వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌పైనే సీఎం తీవ్రంగా స్పందించారు.