గ్రేట‌ర్ ఓటు ఎవ‌రి వైపు.. న‌రాలు తెగే ఉత్కంఠ‌!

గ్రేట‌ర్ ఫైట్ మామూలుగా లేదు గురూ! ఎవ‌రు గెలుస్తారో.. ఎవ‌రు ఓడ‌తారో.. చెప్ప‌డం చాలా క‌ష్టంగా ఉంది. అంతా గంద‌ర‌గోళంగా కూడా ఉంది ఇదీ ఇప్పుడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఎవ‌రిని అడిగినా.. చెబుతున్న మాట‌. ఎవ‌రికీ ఇక్క‌డి ప్ర‌జ‌ల నాడి అంద‌డం లేదు. ఎవ‌రూ ఇత‌మిత్థంగా ఈ పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుంది. ఈ పార్టీ కార్పొరేష‌న్లో పైచేయి సాధిస్తుంది. అని చెప్ప‌లేక పోతున్నారు. సాధార‌ణ ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న స‌ర్వే సంస్థ‌ల తీరు కూడా దాదాపు ఇలానే ఉంద‌ని తెలుస్తోంది. నిజానికి ఎన్నిక‌ల ప్రారంభం నుంచి నాలుగైదు రోజుల‌కే ఎడ్జ్ ఎవ‌రికి ఉంద‌నే విష‌యాన్ని స‌ర్వ‌సాధార‌ణంగా స‌ర్వే సంస్థ‌లు, విశ్లేష‌కులు కూడా అంచ‌నా వేస్తుంటారు.

ఈ విష‌యంలో ఒక‌టి అరా త‌ప్పులు దొర్లినా.. ఏదో ఒక‌రివైపు.. మాత్రం చూచాయ‌గా బ‌లం ఉంద‌ని.. గెలుపు గుర్రం ఎక్కుతార‌ని సూత్రీక‌రించే రిపోర్టులు వ‌స్తుంటాయి. అయితే.. ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు రోజుల గ‌డువున్న నేప‌థ్యంలో కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంద‌నే అంశంపై ఇంకా ఎవ‌రికీ క్లారిటీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. అనేక మీడియా సంస్థ‌లు చూచాయ‌గా ఉన్న ప‌రిస్థితిని ప‌రిశీలించి.. భ‌విష్య‌త్తును తేట‌తెల్లం చేస్తుంటాయి. కానీ, ఈ ద‌ఫా మాత్రం ఆయా సంస్థ‌లు గ‌డిచిన వారం రోజులుగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నాయి. గేట్ర‌ర్ హైద‌రాబాద్ ప్ర‌జా నాడిని తెలుసుకునేందుకు జ‌ల్లెడ ప‌డుతున్నాయి. అయినా.. ఇదిగో ఆ పార్టీకి ఎడ్జ్ ఉంది! ఈ పార్టీకి లేదు.. అని చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ప్ర‌స్తుత గ్రేట‌ర్ ట్రెండ్ చూస్తే.. హోరా హోరీ ప్ర‌చారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల నాడి భిన్నంగా ఉంది. ప్ర‌ధాన పార్టీల‌పై వారు గుర్రుగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్‌ పై ఎంత ఆగ్ర‌హం ఉందో.. అంతే రేంజ్‌లో బీజేపీపై విరుచుకుప‌డుతున్నారు. ముఖ్యంగా కొన్నాళ్ల కింద‌ట వ‌చ్చిన తుఫాన్ కార‌ణంగా హైద‌రాబాద్ మునిగిపోయిన ఘ‌ట‌న నేటికీ.. ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌ళ్ల‌లో క‌నిపిస్తూనే ఉంది. వార‌ని ఎవ‌రూ స‌రిగా ప‌ట్టించుకోలేదని, ఇస్తాన‌న్న ప‌రిహారం ఇవ్వ‌లేద‌ని ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఇక‌, టీఆర్ఎస్ ప‌రిహారం ప్ర‌క‌టించినా.. కొంద‌రికి మాత్ర‌మే అందింది. అది కూడా ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించ‌డంపై ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా త‌మ‌ను ఆదుకోలేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం వ‌ర‌ద బాధితుల‌కు తాము గ్రేట‌ర్ ప‌గ్గాలు చేప‌డితే 25 వేల చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని చెబుతున్నా.. ఎవ‌రూ న‌మ్ముతున్న‌ట్టు స‌ర్వేల్లో క‌నిపించ‌లేదు. ఇక‌, ఆయా పార్టీ ఇస్తున్న‌ హామీలను కూడా ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేదు. ర‌హ‌దారులు బాగోలేవ‌ని, డ‌బుల్ బెడ్ రూం ఫ్లాట్స్ ఇస్తామ‌ని కూడా ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే తాము క‌నిపిస్తున్నామ‌ని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అంటున్నారు. కాంగ్రెస్ విష‌యాన్ని ఎవ‌రూ ఎక్క‌డా ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో ఎవ‌రివైపు గ్రేట‌ర్ ప్ర‌జ‌లు మొగ్గుతున్నార‌నే విష‌యం ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స‌ర్వేల్లో.. కేసీఆర్ కు కొంచెం ఎడ్జ్ క‌నిపిస్తున్నా.. బీజేపీ నేత‌ల దూకుడుతో ఇది త‌గ్గిపోయింది. అలాగ‌ని ఏక‌ప‌క్షంగా బీజేపీకి మొగ్గు చూపుతున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. ఏతావాతా.. గ్రేట‌ర్ నాడి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ అంతుచిక్క‌లేద‌నేది వాస్త‌వం.