1) “మీరు ఉదాసీనంగా ఉంటున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేం కూరుకుపోతున్నాం.“ – కర్ణాటక సర్కారును ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చేసిన విమర్శలు.
2) “మన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నా.. సిద్దరామయ్య సినిమా చూస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తట్టుకోలేక పారిశ్రామిక, ఐటీ దిగ్గజాలు వెళ్లిపోతున్నారు.“ కర్ణాటక విపక్షాల మాట.
3) “త్వరలోనే బెంగళూరు ఖాళీ అవుతుంది. ఇలానే వ్యవహరించండి.. ఏదో ఒకరోజు బెంగళూరులో పల్లీలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది“ నెటిజన్ల టాక్.
4) “సీఎం స్టాలిన్.. నిద్ర పోతున్నారు. పక్కనే ఉన్న ఏపీ అనేక పెట్టుబడులు తెస్తోంది. మన దగ్గర ఏమున్నాయి.“ తమిళనాడులో కల్లోలం.
5) “గూగుల్ ఏఐని చెన్నైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని ముందు నుంచి చెప్పాం. అయినా.. ఒక్కరూ మా మాట వినిపించుకోలేదు“ తమిళనాడు బీజేపీ నేతల సన్నాయి నొక్కులు.
కట్ చేస్తే.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 మాసాల్లో అనేక పెట్టుబడులు తెచ్చినా.. తాజాగా తెచ్చి న గూగుల్ పెట్టుబడి చుట్టుపక్కల రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఏపీని చూసి జెలసీతో వేడెక్కేలా చేస్తోంది. వాస్తవానికి ఆదిలో ఇంత హైప్ రాలేదు. “ఆ.. ఏముంది.. పెట్టుబడుల్లో ఇదొక పెట్టుబడి!“ అని సరిపుచ్చుకున్నారు. పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదని అన్నారు.
కానీ.. ఎప్పుడైతే.. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు సభలో గూగుల్ ఏఐ పెట్టుబడి గురించి ప్రస్తావించారో అప్పటి నుంచి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇక, అంతర్జాతీయ స్థాయి పత్రికలు కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచురించడం కూడా కలిసివచ్చింది. ఈ పరిణామాలతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో పెద్ద ఎత్తున విపక్షాలు.. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates