తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. రాజకీయంగా ఒంటరి పోరుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఒకప్పటి `తెలంగాణ జాగృతి` సంస్థనే దాదాపు ఆమె రాజకీయ వేదికగా మార్చుకున్నారు. తాజాగా జరిగిన బీసీ జేఏసీ బంద్‌లోనూ ఇదే పేరుతో నిరసన తెలిపారు. ఇక, త్వరలోనే ఆమె ప్రజల మధ్యకు యాత్ర రూపంలో వెళ్లనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఉపాధ్యాయ వర్గాలతో కూడిన ప్రత్యేక సంఘం ఏర్పాటైంది. `తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్`ను ఆమె ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ సంఘానికి సంబంధించిన జెండాను, లోగోను కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన కరువు భత్యం పెండింగ్ నిధులు, వేతన సంఘం ఏర్పాటు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి అంశాలపై మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురువురు వేదనను అనుభవిస్తున్నారని అన్నారు. భావి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు పొట్ట కూడా గడవని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఐదు డిఏలను పెండింగులో ఉంచడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని, పీఆర్ సీ(పే రివిజన్ కమిషన్)ను వేయకపోవడంతో ఉపాధ్యాయులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి.. ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని, పీఆర్‌సీని వేయాలని అన్నారు. అదేవిధంగా రిటైరైన ఉపాధ్యాయులకు రెండేళ్లుగా ప్రయోజనాలు అందలేదని తెలిపారు. ఇలా చేయడం వల్ల వారి పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందన్నారు. చాలీ చాలనిపింఛనుతో అగచాట్లు పడుతున్నారని తెలిపారు. హెల్త్ కార్డులను కూడా ఈ ప్రభుత్వం నిలిపి వేసిందన్నారు. కస్తూరి బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లకు 2 నెలలుగా జీతాలు ఇవ్వలేదని.. వారు పండగులు ఎలా జరుపుకొంటారని అన్నారు. తక్షణమే వారికి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని ప్రకటనలు గుప్పించడం కాదని.. వారిని అలా తీర్చిదిద్దే గురువులకు ప్రాధాన్యం ఇవ్వాలని కవిత సూచించారు. పాఠశాలల్లో కనీసం పీఈటీ టీచర్లు లేరన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి వచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల హక్కులను సాధించేందుకు.. ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఉపాధ్యాయులకు కవిత హామీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates