ప్ర‌భుత్వం కూలిపోతుందంటే.. కేటీఆర్ జ‌వాబేంటి?

తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను ప‌క్క‌కు నెట్టి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను పోషిస్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి షాకిచ్చిన ఉత్సాహంలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో భాజ‌పా చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రోజుకో హాట్ కామెంట్‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఆయ‌న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని జోస్యం చెప్పారు. త‌మ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గెలవ‌డం ద్వారా టీఆర్ఎస్‌లో ముస‌లం పుట్టి ఎమ్మెల్యేలు త‌మ వైపు వ‌చ్చేసి ప్ర‌భుత్వం కూలిపోతుంద‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం కావ‌చ్చు. ఈ కామెంట్ మీద జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేటీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు.

ఓ టీవీ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ ఉండ‌గా న్యూస్ ప్రెజెంట‌ర్ బండి సంజ‌య్ కామెంట్ల‌ను ప్ర‌స్తావించి సంబంధిత వీడియోను ప్లే చేశారు. అది చూసి వెట‌కారంగా న‌వ్విన కేటీఆర్.. బండి సంజ‌య్ గాలి తీసే కామెంట్ చేశారు. ముంగేరి లాల్‌కే హ‌సీన్ స‌ప్నే అని ఆ మ‌ధ్య హిందీలో ఒక సీరియ‌ల్ వ‌చ్చేద‌ని.. అందులో అన్నీ కార్టూన్ క్యారెక్ట‌ర్లే ఉండేవ‌ని.. బండి సంజ‌య్‌ది కూడా అలాంటి కార్టూన్ క్యారెక్ట‌రే అని.. అలాంటి వ్య‌క్తి చెప్పిన మాట‌ల్ని ఎవ‌రైనా సీరియ‌స్‌గా తీసుకుంటారా.. ప‌ట్టించుకుంటారా అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

మీడియాలో హెడ్ లైన్స్‌గా రావ‌డానికి ఇలాంటి కామెంట్లు బాగుంటాయ‌ని.. అవి తాత్కాలిక‌మ‌ని.. త‌ర్వాత ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని కేటీఆర్ అన్నారు. త‌మ పార్టీకి వంద మందికి పైగా ఎమ్మెల్యేలున్నార‌ని.. త‌మ పార్టీకి ఎన్ని స్థానాలున్నాయో అన్నింట్లో బీజేపీకి గ‌త ఎన్నిక‌ల్లో డిపాజిట్లు రాలేద‌ని.. అలాంట‌పుడు ప్ర‌భుత్వం కూలిపోతుంది అన‌డానికి లాజిక్ ఏంట‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. త‌మ పార్టీలో మ‌హిళ‌లంద‌రికీ టీవీలో సీరియ‌ళ్లు, ఇంకే కార్య‌క్ర‌మాలు చూడొద్ద‌ని.. బీజేపీ వాళ్లు బోలెండంత వినోదం పండిస్తున్నార‌ని తాను చెప్పాన‌ని.. బండి సంజ‌య్ కామెంట్లు అందుకు తాజా నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న సెటైర్ వేశారు.