జూబ్లీహిల్స్‌: కాంగ్రెస్‌ ప్ల‌స్‌లు-మైన‌స్‌లు ఇవే!

అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి సహా తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. త్వరలో మరింత మంది మంత్రులు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరోవైపు రహమత్ నగర్ సహా బోరబండ ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సభలు నిర్వహిస్తున్నారు. దీనికి కీలక నాయకులు వస్తున్నారు, స్థానికంగా ఉన్న ప్రజలను పిలుస్తున్నారు. పార్టీని గెలిపించాల్సిన అవసరాన్ని అదేవిధంగా పార్టీ చేస్తున్న మంచి పనులను కూడా మీనాక్షి నటరాజన్‌ ప్రజలకు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలు కాంగ్రెస్ గెలిచేందుకు ఉన్న అవకాశాలు ఏంటి? ప్రజల్లో ఉన్న ఆలోచన ఏమిటి అనేది చూస్తే కొన్ని విషయాలు ఆసక్తిగా మారాయి.

అనుకూలంగా ఉన్న విషయాలను గమనిస్తే.. ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. దీనివల్ల మహిళలకు కొంత ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి బలమైన ముఖ్యమంత్రి. పార్టీకి ప్లస్సుగా మారారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా వంటి కార్యక్రమాలను చెబుతున్నప్పటికీ జూబ్లీహిల్స్ లో ఇవి పెద్దగా అమలు కాలేదు. కాబట్టి వీటి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. ఇక 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనిలో జూబ్లీహిల్స్ లో ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది నిరుద్యోగులు లబ్ధి పొందారు అనేది లెక్క తేలాల్సి ఉంది.

మహా అయితే 200 నుంచి 300 మంది ఉద్యోగాలు పొంది ఉంటారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. కానీ దీనిపై స్పష్టత లేదు. వీటిని ప్రచారం చేసుకుంటే కాంగ్రెస్కు కొంత మేరకు ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. కానీ ఇది పెద్దగా ప్రభావం చూపించేలాగా కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్కు ప్రధాన మైనస్ గా మారింది పేదల ఇళ్ళను కూల్చేస్తున్న హైడ్రా అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇది జూబ్లీహిల్స్ లోను ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.

అదే విధంగా బలమైన ముఖ్యమంత్రి ఉన్నారని చెబుతున్నప్పటికీ మంత్రులు కీచులాడుకోవడం మంత్రుల మధ్య ఉన్న విభేదాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అలాగే అవినీతి ప్రధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏ కార్యాలయానికి వెళ్లిన డబ్బులు ఇవ్వకుండా పనులు జరగడం లేదని ప్రజల్లో జరుగుతున్న చర్చ. సో ఈ రెండు ప్రధానంగా సామాన్యులపై ప్రభావం చూపించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తుంది. వీటికి తోడు మాగంటి గోపీనాథ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనక్కి తగ్గి ఉంటే బాగుండేది అన్న చర్చ కూడా ఉంది.

ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్కు వ్యతిరేకమైనప్పటికీ కాంగ్రెస్ నాయకులకు అత్యంత సన్నిహితమైనటువంటి నేతగా గుర్తింపు పొందారు. పార్టీలపరంగా ఆయన ఏ లైన్ తీసుకున్నా.. పనుల పరంగా అదేవిధంగా ఆయన చేసిన వ్యాపారాలపరంగా కాంగ్రెస్ నాయకులతో ఆయనకు ఉన్న సంబంధాలను అందరూ ఒప్పుకుని తీరుతారు. ఇటువంటి సందర్భంలో ఆయన మరణానంతరం వచ్చిన ఉపఎన్నిక కు కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకుండా ఉంటే బాగుండేదని చాలా చోట్ల చర్చ నడుస్తుంది. ఇది ఒకటి కాంగ్రెస్కు ఇబ్బందిగా మారుతుంది.

అదే సమయంలో మాగంటి గోపీనాథ్ సతీమణి రంగంలో ఉండడం, మహిళా సానుభూతి వ్యక్తం కావడం కూడా కాంగ్రెస్కు మైనస్ గా ఉంది. వీటన్నిటిని తట్టుకొని మైనారిటీ వర్గాలను మచ్చిక‌ చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు ఏర్పడింది. సహజంగా మైనార్టీ ఓటు బ్యాంకు ఎంఐఎంకు లేదా కాంగ్రెస్కు పడుతుందన్న వాదన ఉన్నప్పటికీ ప్రభుత్వంలో మైనారిటీలకు ప్రాధాన్యం లభించలేదని వాదన బలంగా వినిపిస్తోంది. మైనారిటీ వర్గానికి చెందిన నాయకులకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వకపోవడం.. ఇబ్బందికర పరిణామంగా మారింది. మరి ఇన్ని మైనస్లు దాటుకుని కాంగ్రెస్ ఏ మేరకు విజయం దక్కించుకుంటుంది చూడాలి.