బీఆర్ఎస్ ఓట్ చోరీ పిటిష‌న్‌.. 2 గంట‌ల్లో తేల్చేసిన‌ హైకోర్టు!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ దాఖ‌లు చేసిన ఓట్ చోరీ పిటిష‌న్‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఓట్ చోరీ అనేది ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ని.. ఎన్నిక‌ల సంఘం పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఎన్నిక‌ల సంఘం స‌ద‌రు ఫిర్యాదుల‌పై స‌రిచూస్తున్నామ‌ని చెప్పిన త‌ర్వాత‌.. తాము జోక్యం చేసుకునేది లేద‌ని తేల్చి చెప్పింది. అనంత‌రం పిటిష‌న్‌ను ప‌రిష్క‌రించిన పేర్కొంటూ విచార‌ణ‌ను ముగించింది.

చిత్రం ఏంటంటే.. గురువారం మ‌ధ్యాహ్నం ఈ పిటిష‌న్ దాఖ‌లు కాగా.. ఆ వెంట‌నే రెండు గంట‌ల్లోనే పిటిష‌న్‌ను ముగించ‌డం!. దీనిపై బీఆర్ఎస్ నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక‌, ఆ పార్టీ వేసిన పిటిష‌న్‌లో జూబ్లీహిల్స్‌లో ఒక వ్య‌క్తికి రెండు ఓట్ల చొప్పున 1940 ఓట్లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అదేవిధంగా ఇత‌ర ప్రాంతాలు.. నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఓట‌ర్లు కూడా భారీ సంఖ్య‌లో(12 వేల‌కు పైగా) ఉన్నారని తెలిపారు. ఈ విష‌యంలో త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

అంతేకాదు.. దీనిపై ఈ నెల 13న ఎన్నిక‌ల సంఘానికి రిప్ర‌జెంటేష‌న్ ఇచ్చామ‌ని.. అయినా బుట్ట‌దాఖ‌లు చేశార‌ని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని.. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడే తెర‌మీదికి వ‌చ్చిందా.. గ‌తంలోనే ఉందా? అని ప్ర‌శ్నించింది. గ‌తంలోనే ఉంద‌ని బీఆర్ఎస్ త‌ర‌ఫు న్యాయ‌వాది శేషాద్రి వివ‌రించారు. అయితే.. ఇప్పుడే ఎందుకు స‌మ‌స్య వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న‌కు.. ఉప ఎన్నిక‌లో న్యాయం చేసేందుకు వ‌చ్చామ‌న్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఈసీ త‌ర‌ఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అదేస‌మ‌యంలో వ‌చ్చిన ఫిర్యాదుల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని.. పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు నిర్వ‌హించేం దుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని.. ఈ స‌మ‌యంలో ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునేది లేద‌న్నారు. కేవ‌లం వ్య‌క్తిగ‌త అంశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. బీఆర్ఎస్ లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్ని స్తామ‌ని చెప్పడం గ‌మ‌నార్హం.